YS Jagan: అనకాపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన - సెజ్ ప్రమాద బాధితులకు పరామర్శ
Andhrapradesh News: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
YS Jagan Anakapalli Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) శుక్రవారం అనకాపల్లిలో పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యం'
అచ్యుతాపురం ఘటన బాధాకరమని.. ప్రమాదం జరిగింది పట్టపగలైనా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ అన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర వివరాలు లేవన్నారని.. ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని.. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఎల్జీ పాలీమర్స్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించామని 24 గంటల్లోపే పరిహారం అందించామని గుర్తు చేశారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరగాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వకుంటే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పరిశ్రమలపై పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.
మరో ప్రమాదం
మరోవైపు, అచ్యుతాపురం ప్రమాద ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో గురువారం రాత్రి రసాయనాలు కలుపుతుండగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు వెంటనే క్షతగాత్రులను విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ బి - బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 కిలో లీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మ్యాన్ హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పై కప్పునకు తగిలి కార్మికులపై పడింది.
ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్, కోహర్, రోస, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణకు గాయాలయ్యాయి. బాధితులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే అక్కడకు వెళ్లాలని హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో హోంమంత్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
Also Read: Anakapalli News: పరవాడ ఫార్మా సెజ్‌లో ప్రమాదం- నలుగురికి తీవ్ర గాయాలు- ఒకరి పరిస్థితి విషమం