YCP Manifesto : బాపట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో - నవరత్నాలకు తోడు మరిన్ని వజ్రాలు !
YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టోను బాపట్ల సిద్ధం సభలో విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్తగా పెట్టాల్సిన పథకాలపై ఇప్పటికే సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు.
YCP Manifesto : నేడు వైసీపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాలను కొనసాగించడంతో పాటు పాటు కొత్త పథకాలను ప్రవేశ పెట్టనున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోను చాలా కీలకంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది. ముఖ్యంగా నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో పొందుపర్చిన మిగిలిన అంశాలలో 99శాతానికిపైగా అమలు చేశామని వైసీపీ చెబుతోంది. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కొత్తగా మ్యానిఫెస్టోలో ప్రకటించాల్సి ఉంది.
పాత మేనిఫెస్టోలో వరత్నాలు ఉన్నాయో వాటితో పాటు కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ.. చాలా కీలకమైన రైతులు, మహిళలు.. వీరికి ఉపయోగపడే విధంగా కొత్త స్కీమ్ లను మ్యానిఫెస్టోలో చేర్చాలని సీఎం జగన్ యోచిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకాల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి చాలారోజులుగా వర్కౌట్ కూడా జరుగుతోందని వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీ తర్వాత వస్తుంది. మార్చి పదో తేదీన బాపట్ల సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. అంటే షెడ్యూల్ వచ్చేలోపే మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు
2019 ఎన్నికల నాటికి ఇచ్చిన హామీల్లో దాదాపు 95శాతం అమలు చేశామని ఆ పార్టీ చెబుతోంది. దాదాపు 129 హామీలు ఇస్తే అందులో 111 నెరవేర్చినట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. మరో 12 హామీలు వివిధ దశల్లో ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే మరో 45 హామీలను అదనంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ 2019లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలు, వైఎస్సార్ ఆసరా పెన్షన్లు, జలయజ్ఞం, ఉపాధి, మద్య నిషేధం వంటివి ఉన్నాయి. వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల రుపాయల నగదును లబ్దిదారులకు అందచేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల కేటాయింపు వంటి పథకాలతో దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల రుపాయల విలువైన పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించామని వైసీపీ చెబుతోంది. ఒక్కో కుటుంబంలో రెండు, మూడు పథకాలు అందుకున్న వారు కూడా ఉన్నారని వైసీసీ చెబుతోంది.
వైఎస్సార్సీపీ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలోను ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్నీ రద్దవుతాయని ముఖ‌్యమంత్రి స్వయంగా బహిరంగ సభల్లో చెబుతున్నారు.దీంతో టీడీపీ కూడా ఇటీవల జరిగిన మహానాడులో నగదు బదిలీ పథకాలను ప్రకటించింది. మహిళా ఓటర్లే లక్ష్యంగా పలు పథకాలు ప్రకటించింది. వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న వాటికంటే మెరుగ్గా నగదు బదిలీ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ కు కౌంటర్ గా వైసీపీ పథకాలు ఉండనున్నాయి.