Tenali MLA : ఫీజు రీఎంబర్స్‌మెంట్ అడిగారని పేదల ఇంటి పట్టా రద్దు - తెనాలి ఎమ్మెల్యే నిర్వాకంపై విమర్శలు!
తెనాలి ఎమ్మెల్యే ఫీజు రీఎంబర్స్‌మెంట్ గురించి అడిగితే ఇంటి పట్టాను రద్దు చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tenali MLA : గడప గడపకూ వెళ్తున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల పథకాలు రాలేదని ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు. పేదలపై కక్ష సాధింపులకు సైతం దిగుతూండటం చర్చనీయాంశమవుతోంది. తాజాగా తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొల్లిపర గ్రామానికి గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే
కొల్లిపర గ్రామానికి చెందిన వి నాగలక్ష్మి ఎం ఫార్మసీ విద్యను అభ్యసించింది. ఎగ్జామ్స్ రెండు నెలలు ఉండంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పోవడంతో సమస్య ప్రారంభమైది. కోర్స్ పాసైనా కాలేజీలో తాను చెల్లించ వలసిన ఫీజు బకాయి 2.2 లక్షలు అలాగే ఉండిపోయింది. ఈ ఫీజు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వటానికి నిరాకరించింది. గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శివకుమార్ దృష్టికి నాగలక్ష్మీ తన సమస్యను తీసుకు వెళ్ళింది. పరిస్థితి ఎమ్మెల్యే కి వివరించింది. ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం నిలుపుదల చేయటంతో తన సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని తెలిపారు విద్యార్థి నాగలక్ష్మి.
ఫీజు రీఎంబర్స్ మెంట్ ఆపేయడంతో సర్టిఫికెట్లు రాక ఉద్యోగం తెచ్చకోలేకపోతున్నానని వాపోయిన యువతి
విద్యార్థిని సమస్యను పట్టించుకోకుండా ప్రభుత్వం కుటుబానికి అందించిన ఇంటి స్థలం పట్టాను గురించి ప్రస్తావించారు ఎంఎల్ఏ. ఇళ్ల స్థలం కావాలా సర్టిఫికెట్ కావాలా అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయింది. ఎంతో కష్టపడి చదివానని సర్టిఫికెట్లు ఉంటే తనకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రధేయపడింది . సర్టిఫికేట్ విషయం కాకుండా ఎమ్మెల్యే ఇళ్ల స్థలం పట్టా గురించి పలుమార్లు అడిగారు. సర్టిఫికెట్ ప్రస్తుతం చాలా ముఖ్యం అని ఆ తర్వాతే పట్టా అని ఆమె అన్నారు. ఎంఎల్ఏ ఆగ్రహంతో అధికారులను పిలిచి ఇంటి స్థలం పట్టాను రద్దు చేయమని సూచించారు అర్హత ఉంది కాబట్టే తమకు ప్లాట్ వచ్చిందని కుటుంబ సబ్యులు నచ్చచెప్ఫే ప్రయత్నం చేశారు. విద్యార్థిని ఉద్యోగం, ఉపాది పొందాలంటే సర్టిఫికేట్ కీలకమని తెలిపారు.
ప్రశ్నించినందుకు ఇంటి పట్టాను రద్దు చేయించిన ఎమ్మెల్యే
అయినా ఎంఎల్ఏ శివకుమార్ పట్టించుకోలేదు, తనలాగా ఎంతో మంది చదివి పాస్ అయి కూడా సర్టిఫికెట్లు లేక ఉ ద్యోగాలు లేక ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని ఫీజులు చెల్లించ లేని దీనస్థితి లో ఉన్నామని తెలిపారు. ఫీజు రీఎంబస్మెంట్ ద్వారా ప్రభుత్వం సాయం అదిస్తుందనే ఉన్నత విద్యలు అబ్యసిస్తున్నామని తెలిపారు...ఇప్పడు ప్రభుత్వం ఫీజు చెల్లించకపోతే తమ గతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లక్షలు చెల్లించి చదువుకొనే పరిస్తితి తమకు లేదని చెబుతున్నారు...ఇప్పటికైన ప్రభుత్వం తమలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలని. సకాలంలో ఫీజు రీఎంబస్మెంట్ విడుదల చేయాలని విద్యార్థిని నాగలక్ష్మి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.
పేదలపై ఇలా ఎమ్మెల్యే ప్రతాపం చూపించి ఇంటి పట్టా రద్దు చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.