Andhra Pradesh: పార్లమెంటరీ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడి మధ్య తేడా ఏమిటో? సిక్కోలులో సెట్ కాలేదు!
Andhra Pradesh News | అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లోగానీ, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలోగానీ మార్పు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Srikakulam News : సిక్కోలు వైసీపీలో ముసలం మొదలైంది. ఆరు నెలల కిందటి వరకు బుగ్గ కార్లు, కాన్వాయ్‌తో హడావుడి చేసిన వారంతా సైలెంట్ అయిపోయారు. అధికారపక్షం తీరును ఎండ గట్టాల్సింది పోయి.. పార్టీ అంతర్గత రాజకీయాలకే నేతలకు సరిపోతోంది. అప్పుడప్పుడూ మాజీ మంత్రి అప్పలరాజు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అధికారం పోయి 4 నెలలు కావొస్తున్నా.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంలో అధిష్ఠానం విఫలమైంది. ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ కనిపించడం లేదని జిల్లాలో వినిపిస్తోంది. 'కుల' సమీకరణాలతో 'పెద్ద' నేత పల్లెత్తు మాట కూడా అనటం లేదు. దీంతో మిగిలిన వారంతా.. మనకెందు కులే అంటూ.. మిన్నకుండిపోయారు. అసలేం జరగుతుందన్న అబ్జర్వేషన్ కూడా కనిపించడం లేదు. ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని వైఎస్ జగన్.. అధికారంలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలను కెలికేసిన 'పెద్ద' నేతలు అప్పటి స్పీకరున్న చోట గ్రూపులను ఎగదోసారు.
ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలిలోనూ రసాభాస.. మారని అధినేత తీరు..
ఓట్ల శాతం బాగానే లేకున్నా సీట్లు రాకపోవడంతో డీలా పడిన ఏ రాజకీయ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. అత్యంత బలమైన క్యాడర్, స్థానిక సంస్థలు చేతిలో ఉన్నా.. ఎందుకు ఓడిపోయామన్న అంశంపై ఓ అంచనాకు వస్తుంది. భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తుంది. కానీ వైసీపీలో అవేమీ కనిపించటం లేదు. దీనికి తోడు రోజుకో వివాదం వైసీపీ అధినేత జగన్ ను కదలనీయటం లేదు. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో? ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో అర్థం కాక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. పార్లమెంటరీ సమన్వయకర్తకు, జిల్లా అధ్యక్ష పదవికి తేడాఏమిటో ఆయనకే తెలియాలి. క్యాడర్ ఎవరితో సమన్వయం చేసుకోవాలో స్పష్టత లేదు. ఈ అంశంపై ఎన్నో చర్చలు సాగుతున్నాయి. దీంతో క్యాడర్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఎప్పటిలాగే.. ‘పెద్ద’నేతలు మిగతా నియోజకవర్గాల్లో ఎగదోతలకు తెరతీశారు. జిల్లాలోనే అతిపెద్ద కళింగ సామాజిక వర్గానికి చెందిన సీతయ్యకు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పజెబితే.. అంతా ఒకే తాటిపై పనిచేసే అవకాశం లేకపోలేదని, దీనికి జిల్లా అధ్యక్షుడిని లింకు పెట్టడంతో.. క్యాడర్లో ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. 'కుల' సమీకరణాలతో అధికార పక్షంపై నేరుగా విమర్శలు చేయలేనివారిని 'కీ' పదవుల్లో కూర్చోబెడితే ప్రయోజనం ఉండదని క్యాడర్ అభిప్రాయపడుతోంది.
అంతా అయోమయం
ఇక జిల్లాలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇచ్ఛాపురం సమన్వయకర్త జాడ లేకుండా పోయింది. జడ్పీ చైర్‌పర్సన్ పూర్తిగా కనిపించటం మానేశారు. రెండేళ్ల కిందటి నుంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపట్టి.. పల్లెనిద్రలు సైతం చేసిన ఆమె.. ఇప్పుడెక్కడున్నారంటూ క్యాడర్ అడుగుతోంది. అక్కడ ఎమ్మెల్సీ నర్తు.రామారావు తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారని వినిపిస్తోంది. ఇక పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు యాక్టివ్గానే ఉన్నా.. ఆయన సేవలను వాడుకునే స్థితిలో పార్టీ ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు కుటుంబ కలహాలతో టెక్కలి నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అబాసుపాలయ్యారు. దీనికి తోడు ప్రసారమాధ్యమాల్లో దివ్వెల మాధురి చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు 'సస్పెన్షన్ వార్నింగ్' వరకూ తెచ్చాయి. తిలక్ ను సమన్వయకర్తగా నియమించినా.. దువ్వాడ వర్గం ఆయనకు సహకరించటం లేదు. శ్రీకాకుళంలో పార్టీ బలోపేతానికి చర్యలు ఉన్నాయా, లేక ఇలాగే కొనసాగుతుందానని కార్యకర్తలు, కేడర్ అమోమయంలో ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మౌనం వీడటం లేదు. ఆమదాలవలసలో మళ్లీ ఎప్పటిలాగే గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి.
పార్లమెంటరీ సమన్వయకర్తగా మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంను నియమించినా.. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యులు ఎవరన్న అంశాన్ని పార్టీ అధినేత జగన్ ఇంకా తేల్చలేదు. దీంతో 'పెద్ద' నేత.. అక్కడ మరో యువనేతను ఎగదోస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధినేత చొరవ తీసుకుని.. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: YS Jagan: యుద్ధానికి సిద్ధం కండి, 4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్