Weather Latest Update: శ్రీలంకలో తీరం దాటిన వాయుగుండం, నేడూ ఈ జిల్లాల్లో జోరు వర్షాలు
రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం పశ్చిమ నైరుతిగా కదిలి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటింది. ఇదే సమయంలో అది తీవ్ర అల్పపీడనంగా బలహీనం చెందింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తూ నేడు (డిసెంబరు 26) ఉదయానికి కొమరిన్ తీరం దిశగా వస్తుందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
‘‘వాయుగుండం శ్రీలంకను తాకినా తేమ గాలులు నేరుగా దక్షిణ ఆంధ్రాని తాకుతున్నాయి. దీని వలన రేపు ఉదయం వరకు ప్రకాశం జిల్లా కోస్తా భాగాలు, బాపట్ల జిల్లా కోస్తా భాగాలు, నెల్లూరు జిల్లా కోస్తా భాగాలతో పాటుగా కృష్ణా జిల్లా కోస్తా భాగాల్లో అక్కడక్కడ మనం వర్షాలను చూడగలం. తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలోని వివిధ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ-ఆగుతూ కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన మేఘాలు నేరుగా నెల్లూరు నగరంలోకి విస్తరిస్తు్న్నాయి. మరో గంటపాటు నెల్లూరు నగరం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో వర్షాలు ఉండనున్నాయి. తెల్లవారుజామున వరకు ఇదే పరిస్ధితి కొనసాగనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఇక రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిధిలో సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో సోమవారం కొన్ని జిల్లాల్లో చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 25, 2022