Weather Latest Update: ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షం అలర్ట్! ఆ వాయుగుండం ఎఫెక్టే - తెలంగాణలో పరిస్థితి ఇలా
ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నేయ గాలుల వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని ఐఎండీ చెప్పింది.
నైరుతి బంగాళాఖాతం (తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం) లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురవనున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. దీని ప్రభావం ఏపీపై మాత్రం దక్షిణ కోస్తాపైనే ఉంటుందని వివరించారు.
ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నేయ గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో మిగతా చోట్ల పొడి వాతావరణ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
‘‘బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర - ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర - వాయువ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావంతో మరో మూడు రోజులు వరకు విపరీతమైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.
అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తుంటాయి కాబట్టి. డిసెంబరు 25న ముందు చెప్పిన విధంగానే దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ప్రారంభించనుంది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
చలి తీవ్రత ఇలా..
తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున.. వచ్చే రెండు రోజులు మధ్యాహ్నం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ జిల్లా టేక్మాల్ లో 13.4 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 10.4, ఆదిలాబాద్ జిల్లాలో 10.8గా నమోదైంది. నిర్మల్ జిల్లాలో 11.7, మంచిర్యాల జిల్లాలో 12.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.