Vontimitta Sri Rama Kalyanam 2022 : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 15న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Sri Rama Kalyanam 2022 : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సీఎం జగన్ ఏప్రిల్ 15వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Vontimitta Sri Rama Kalyanam 2022 : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావొచ్చని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒంటిమిట్టలో టీటీడీ నిర్మించిన ఆలయ కార్యాలయాల సముదాయం, అతిథి గృహం, యాత్రికుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డితో కలసి శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వైవీ సుబ్బారెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం కల్యాణ ప్రాంగణాన్ని వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రూ.63 కోట్లతో అభివృద్ధి పనులు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి ఇబ్బందులు తలెత్తినా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా కల్యాణం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఇప్పటి వరకు సుమారు 63 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. 4.3 కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయం, కార్యాలయాల సముదాయం, అతిథి గృహం శుక్రవారం ప్రారంభించామన్నారు.
అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణం
తాళ్ళపాక అన్నమయ్య తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇక్కడ భద్రత, అర్చకుడు, ఇతర సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించామన్నారు. వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతిరోజు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో, భూమన కారుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో 2008లో అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ ప్రాంగణంలోని అన్నమయ్య విగ్రహానికి రంగులు, నిత్య సంగీత కార్యక్రమాలు, పచ్చదనాన్ని పెంపొందించి భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాళ్లపాకలో కూడా అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నందలూరు ఆలయం టీటీడీలో విలీనం?
నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత టీటీడీలో విలీనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని సంప్రదాయబద్దంగా నడక, వాహనాలల్లో వెళ్లేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు సుబ్బారెడ్డి 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. నందలూరు సౌమ్యనాథ స్వామి వారిని దర్శించుకున్నారు.