Chandrababu : వైసీపీ నేతలకు విశాఖ ఆస్తులపైనే ప్రేమ, జగన్ కొట్టేసిన భూముల విలువ రూ.40 వేల కోట్లు - చంద్రబాబు
Chandrababu :వైసీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచని వస్తువు లేదని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
Chandrababu : సీఎం జగన్ ఆక్రమించిన భూముల విలువ రూ.40 వేల కోట్లు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయనగరంలో చంద్రబాబు మాట్లాడుతూ.... సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విధ్వంసం చేయడం సులువని, అభివృద్ధి చాలా కష్టమన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచని వస్తువు, పన్ను వేయని రంగం లేదని ఆరోపించారు. పక్కనే నది ఉన్నా విజయనగరం వాసులకు ఇసుక కూడా దొరకడం లేదన్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇసుక దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
మద్యపాన నిషేధం అన్నాడు, ఇప్పుడు అదే మద్యంతో ప్యాలెస్ లో డబ్బులు పోగేస్తున్నాడు..#IdhemKarmaManaRashtraniki #CBNInVizianagaram #TDPforDevelopment #NCBN #JaganPaniAyipoyindhi #JaganFailedCM pic.twitter.com/yCVqih048C
— Telugu Desam Party (@JaiTDP) December 24, 2022
మద్యపాన నిషేధం హామీ ఏమైంది?
ఏపీకి ఎవరూ చేయని నమ్మక ద్రోహం సీఎం జగన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పని కూడా పూర్తిచేయలేదన్నారు. మద్యపాన నిషేధం హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని ధరలు పెరిగాయన్నారు. కరెంట్ ఛార్జీలు డబుల్ అయ్యాయన్నారు. దేశంలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అన్నారు. ఇంటిపన్ను, వృత్తిపన్ను, తాగునీటి ఛార్జీలు అన్నీ పెంచారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నవరత్నాలు కాదని నవమోసాలు అని మండిపడ్డారు. వైసీపీ నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ అని విమర్శించారు. రుషికొండను పూర్తిగా ధ్వంసం చేశారని, దసపల్లా భూముల ఆక్రమించారని ఆరోపించారు. సీఎం జగన్ కొట్టేసిన భూముల విలువ రూ.40 వేల కోట్లు ఉంటుందని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లను తనఖా పెడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఎవరూ ఆనందంగా లేరన్నారు.
విశాఖ గంజాయికి రాజధాని
"వైసీపీకి అధికారం ఇచ్చి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. నా జీవితంలో అపజయాన్ని ఒప్పుకోను. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకుందాం. జగనన్న బాణం గురితప్పింది. ఇప్పుడు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం పేదలే. సంక్షేమానికి నూతన నిర్వచనం ఇచ్చింది ఎన్టీఆర్. పేదరికంలేని సమాజాన్ని నిర్మించడమే నా లక్ష్యం. సంక్షేమ పథకాలు ఇంకా పెంచుతాం. సంపద సృష్టిస్తాం. వాటిని ప్రజలకు పంచిపెడతాం. నాకు ప్రజలే ఆల్ ఇండియా రేడియోలు. మీరే నా ప్రచారకర్తలు. మీకు అండగా ఉంటాను. పోలీసులు అక్రమ కేసులు పెడితే నేను మీకు అండగా ఉంటాను. టీడీపీ నాయకత్వం ఉత్తరాంధ్ర నాయకత్వం. ఉత్తరాంధ్ర టీడీపీకి గుండె కాయ. టీటీడీ బోర్డులో ఉత్తరాంధ్రకు చెందిన వాళ్లు ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వాళ్లు లేరు. అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక, సంక్రాంతి కానుక తీసేశారు. రూ.200 పింఛన్ ను రూ.2 వేసింది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఎంత దివాళా తీసిందంటే వాహనాలకు ఇచ్చే సీ బుక్ లు కూడా ఇవ్వడంలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇప్పటికే రూ.9.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. విశాఖను గంజాయికి రాజధాని చేశారు. మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు." - చంద్రబాబు