Minister Botsa On Chandrababu : వైఎస్సార్ చెప్పింది నిజమే చంద్రబాబుకు ఆ శాపం ఉంది - మంత్రి బొత్స
Minister Botsa On Chandrababu : వ్యవసాయం దండగ, పోరాటాలు చేస్తున్న వాళ్లను కాల్చి పారేండన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు.
Minister Botsa On Chandrababu : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిందే చంద్రబాబు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పనులకు బిల్లులు, ఇన్ పుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు చెల్లించాల్సిన మొత్తం.. ఇలా వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను దోచుకోవడానికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు వచ్చారంటున్న చంద్రబాబు.. వారు ఏం దోచుకున్నారో చెప్పాలన్నారు. మా శాఖలపై వారేమైనా స్వారీ చేస్తున్నారా? మేం ఏమైనా చిన్న పిల్లలమా? ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకే చెందిన అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులకు లేని అధికారాలేమిటీ, మాకున్న అధికారాలేమిటీ? అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో రాజులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. వైసీపీ నుంచి కొందరి టీడీపీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.
త్వరలోనే విశాఖకు రాజధాని
"బీసీలకు న్యాయం చేశావా? విజయనగరం జిల్లాకు చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏం చేశారో చెప్పగలరా? మీ ప్రభుత్వంలో ఓ వర్గానిదే పెత్తనమని చెప్పగలరా?" అంటూ మంత్రి బొత్స నిలదీశారు. అమరావతిని దోచుకున్నది చంద్రబాబు అన్నారు. రూ. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని మట్టిలో పోశారని విమర్శించారు. దానిని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం తప్పా.. విశాఖ రాజధాని కావాలనే తామంతా కోరుతున్నామన్నారు. త్వరలోనే విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ, పోరాటాలు చేస్తున్న రైతులను కాల్చి పారేయండన్న చంద్రబాబు.. ఇప్పుడు రైతుల కోసం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీసీలకు ఎన్టీఆర్ హయాంలో జరిగినది ఈయన చెప్పుకోవడమేమిటని ప్రశ్నించారు. బీసీలను ముంచింది చంద్రబాబే అని విమర్శించారు. మూడు రోజులుగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు చెబుతున్నవన్నీ సోది, అబద్ధపు, మోసపూరిత మాటలేనని మంత్రి బొత్స విమర్శించారు. రైతులు, బీసీలపై చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు నిజం మాట్లాడకూడదనే శాపం
"బొబ్బిలి చక్కెర కర్మాగార పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినది ఎవరు? రైతుల బకాయిలు చెల్లించింది ఎవరు? బొబ్బిలి రాజులు దీనిపై ఏమీ చెప్పలేదా? ఎన్నికలకు ముందు తోటపల్లికి శంకుస్థాపన చేసి మీరు వదిలేస్తే.. ఆ పనులను దివంగత రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. వైఎస్సార్ అన్నట్లు నిజాలు మాట్లాడకూడదని చంద్రబాబుకు శాపం ఉంది. భోగాపురంలో విమానాశ్రయం కోసం అశోక్ గజపతిరాజు ఏం చేశారని, తమ హయాంలోనే కోర్టు కేసులన్నీ పరిష్కరించి శంకుస్థాపనకు సిద్ధం చేశాం. గిరిజన ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఉంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే స్థల మార్పు చేశాం. ఇళ్ల విషయంలో కేంద్రం ఏం చెప్పిందో.. చంద్రబాబు ఏం విన్నారో మాకు తెలియదు. కట్టకుండా ఉన్న ఇళ్లు మా ప్రభుత్వం ఇస్తుందని ఎక్కడైనా చూపిస్తే మేము బాధ్యత వహిస్తాం. ఫలానా చోట నా మేనల్లుడు గానీ, వైసీపీ ఎమ్మెల్యేలు గానీ దోచేస్తున్నారని ఎక్కడైనా చూపించగలరా?. " అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.
ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు.