Pawan Kalyan News: నా పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా? విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
తన పర్యటనలో ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేసిన కారణంగా కొందరు విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ సెంటర్ లకు సకాలంలో చేరుకోలేకపోయారన్న ప్రచారంతో దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Andhra Pradesh News | విశాఖపట్నం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటన కారణంగా దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ కు హాజరు కాలేకపోయారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోవడానికి తలెత్తిన పరిస్థితిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. పెందుర్తి ప్రాంతంలో కొందరు విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ సెంటర్లకు సకాలంలో చేరుకోలేకపోయారని.. అందుకు ఉప ముఖ్యమంత్రి కాన్వాయయ్ కారణమని జరిగిన ప్రచారం, వార్తలను పరిగణనలోకి తీసుకొని వాస్తవాల కోసం విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
తన కాన్వాయి వెళ్లడానికి అక్కడ ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలిపివేశారు ? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ ఎలా ఉంది ? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్‌ను సైతం ఏమైనా కంట్రోల్ చేశారా ? లాంటి అంశాలపై విచారణ చేపట్టాలని విశాఖపట్నం పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని, ముఖ్యంగా అర్జంటుగా వెళ్లాల్సిన వారికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ ఉంటారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన నేతలు, మంత్రుల పర్యటనలలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు ఆదేశాలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులకు ట్రాఫిక్ సమస్యలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి స్పష్టమైన ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. ఆ సమయంలో ఏమైనా ఎమర్జెన్సీ లాంటివి ఉంటే తెలుసుకుని అలాంటి వారికి ప్రయాణం ఇబ్బంది కలగకుండా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ తన ప్రతీ పర్యటన సందర్భంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని గుర్తుచేస్తుంటారు. పవన్ కళ్యాణ్ తాజా పర్యటనలో కూడా పోలీసులు, అధికారులు అదే పద్ధతి పాటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైరన్ సౌండ్ సైతం తగ్గించి ప్రయాణిస్తారని డిప్యూటీ సీఎం ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది.
1. ప్రతీ అభ్యర్థి ఉదయం 07:00 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్షా కేంద్రం యొక్క గేట్ ఉదయం 8:30 గంటలకు మూసివేయబడుతుంది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి, ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలికకూ, ఉదయం… pic.twitter.com/QcnkwEI1pu
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) April 7, 2025
విశాఖ పోలీసుల ప్రకటన
విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ రాయలేకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఏమాత్రం కారణంగా కాదని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జేఈఈ ఎగ్జామ్ రాల్సిన అభ్యర్థులు ఉదయం 07:00 గంటలకు రిపోర్ట్ మొదలవుతుంది. ఉదయం 8:30 గంటలకు ఎగ్జామ్ సెంటర్ గేట్ క్లోజ్ చేస్తారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు ఆ జంక్షన్ నుంచి వెళ్ళింది. కనుక ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం నుంచి డిప్యూటీ సీఎం కదలికకూ, ఉదయం 7:00 నుంచి 8.30 గంటలలోగా రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది.
ఏప్రిల్ 02న ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజున ఎగ్జామ్ మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76, 61 మంది గైర్హాజరైన అభ్యర్థుల సంఖ్య (ఆలస్యంగా వచ్చిన వారితో కలిపి) ఉంది. అంటే గైర్హాజరైన విద్యార్థులు (ఆలస్యంగా వచ్చిన వారితో సహా) సంఖ్య ఈ రోజు తక్కువగా ఉంది. అభ్యర్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పైన పేర్కొన్న పరీక్షా కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా చూసేందుకు ఉదయం 08:30 గంటల వరకూ బిఆర్ టిఎస్ రోడ్డు, గోపాలపట్నం - పెందుర్తి సర్వీస్ రోడ్లలో ఎలాంటి ట్రాఫిక్ ను నిలిపివేయలేదు అని విశాఖ సిటీ పోలీసులు వెల్లడించారు.























