Gudivada Amarnath: రేపు ఉత్తరాంధ్రలో ఒక చారిత్రక ఘట్టానికి అంకురార్పణ: మంత్రి గుడివాడ అమర్నాథ్
Mulapeta Port నిర్మాణానికి అంకురార్పణ జరగబోతోంది. మూలపేట వద్ద 3000 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న పోర్టు నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
Bhavanapadu Port renamed Mulapeta Port:
మూలపేట పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన నేడు
-- తొలి దశలో రూ. 3000 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణం
-- 23.5 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ సామర్థ్యం
--ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదొక చారిత్రాత్మక ఘట్టం
-- తమది చేతల ప్రభుత్వమని చెప్పడానికి ఇదే నిదర్శనం
పోర్టు ఏర్పాటు నిర్మాణంతో మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం
-- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఒక చారిత్రిక ఘట్టానికి అంకురార్పణ జరగబోతోంది. రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు సఫలీకృతం కాబోతున్నాయి. ఇందులో భాగంగానే మూలపేట పోర్టు నిర్మాణానికి అంకురార్పణ జరగబోతోంది. మూలపేట వద్ద 3000 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న పోర్టు నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులను మోసం చేసింది. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆ విధంగా చేయలేదు. ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వాస్తవ రూపంలో తీసుకువచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. ఈ మూలపేట తొలిదశలో పోర్టులో 23.5 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన నాలుగు బెర్తులను నిర్మిస్తున్నామని చెప్పారు. మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సముద్రతీరాన్ని, వనరులను సద్వినియోగం చేసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారని, అందులో భాగంగానే మ్యారీ టైం బోర్డు సహకారంతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు.
బందరు, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి రామాయపట్నం పోర్టుకు ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో తొలి వెసెల్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయని, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లో 170 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెంలో మరొక ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. మూలపేట పోర్టు, సిక్స్ లైన్ల హైవే నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్రలో మరొక కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెర తీయనున్నారని అమర్నాథ్ చెప్పారు. వచ్చే నెల మూడవ తేదీన సుమారు 3500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాని ఆహ్వానించానని మంత్రి అమర్నాథ్ చెప్పారు. 2025 తొలి అంకంలో మొదటి ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుందని అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశామని మంత్రి అమర్నాథ్ వివరించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎప్పుడైనా ఇంత మేలు చేసిందా? అని ఆయన ప్రశ్నించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపాడు పోర్టు నిర్మాణం పూర్తయితే చత్తీస్గడ్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి మినరల్స్, గ్రానైట్స్, వివిధ రకాల ఉత్పత్తులు దేశ, విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకి అధిక మొత్తాన్ని వెచ్చించి అభివృద్ధిని విస్మరించిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న విస్తృత అభివృద్ధి కార్యక్రమాలతో చెక్ చెప్పనున్నామని అమర్నాథ్ చెప్పారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా అవి ప్రతిపక్షాలకు కనిపించకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల విశాఖలో జరిగిన ఇండస్ట్రియల్ సమిట్లో వచ్చిన ఎంఓయూ లు ఒక్కటొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే 99 వాణిజ్య సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయని, ప్రస్తుతం ఇవి స్థల పరిశీలనలో ఉన్నాయని, దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని అమర్నాథ్ తెలియజేశారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో 3500 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధం చేశామని, అలాగే మూలపేట వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించమని కోరామని ఆయన వివరించారు. ఏది ఏమైనా మూలపేట పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వమే నడపాలి
ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్నాథ్ సమాధానం చెబుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ గానే ఉండాలి. ప్లాంట్ ను ముక్క ముక్కలు చేసి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విక్రయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, నష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలను కేంద్రం ఇప్పటికీ నడుపుతోందని, అటువంటప్పుడు స్టీల్ ప్లాంట్ నడపడానికి ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు.
32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి కేంద్రం, దాన్ని కొంటామంటూ తెలంగాణ ప్రభుత్వం రోజుకో మాటతో విశాఖపట్నం వచ్చి అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదన్నది తమ ప్రభుత్వ అభిమతమని, ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపడుతున్న ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని అమర్నాథ్ స్పష్టం చేశారు