Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉద్రిక్తత, కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కార్మికుల ఆందోళన
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతోందని కేంద్రం ప్రకటించడంతో... ఉక్కు కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ సమితి సభ్యుల ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుందని కేంద్రం చెప్పిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కూర్మన్న పాలెం జంక్షన్ వద్ద కార్మికులు రోడ్డుపై నిరసన చేపట్టారు. విశాఖ స్టీ్ల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కార్మికులు ధర్నాకు దిగారు. ఉక్కు పరిశ్రమ కార్మికులు కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఎంతకైనా పోరాడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
కేంద్రం క్లారిటీ
కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగన్ సింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై పరస్పర విరుద్ద కామెంట్స్ చేశారు. గురువారం ఉదయం ప్రైవేటీకరణపై ఇప్పుటికిప్పుడు ముందుకెళ్లడంలేదని చెప్పి, సాయంత్రానికి మాట మార్చారు. తాను కేబినెట్ మంత్రిని కాదంటూ ప్రైవేటీకరణ రద్దు తూచ్ అన్నారు. ఉక్కు సహాయ మంత్రి వ్యాఖ్యలపై కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. స్టీల్ ప్లాంట్ పనితీరు మెరుగుకు కేంద్రం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వంతు కృషి చేస్తున్నాయని ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందన్న కేంద్రం
కేసీఆర్ దెబ్బకు కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేసి గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా షాక్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనకు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్లేనని అందరూ అనుకున్నారు. తమ ఘనత అంటే తమ ఘనత అని ప్రకటించుకున్నారు. కానీ..అదంతా అవాస్తవం అని.. తేలిపోయింది. విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో.. మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని కేంద్రం తెలిపింది.