Visakha Steel Plant: ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ.. అధికార, ప్రతిపక్ష నేతల సంఘీభావం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
LIVE
Background
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు నేడు, రేపు రెండు రోజులపాటు ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగిస్తారు. వేలాదిగా కార్మికులు ఢిల్లీకి చేరుకుని తమ సమస్య, ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
సొంతంగా గనులు కేటాయించాలి..
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారని, ఏపీ విద్యార్థులతో పాటు తెలంగాణలోని యువకులు, విద్యార్థులు సైతం పోరాటాలలో పాల్గొన్నారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు లేని కారణంగా ఇతర గనుల నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేయాల్సి వస్తోందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడిగా పోరాటం చేద్దాం.. విజయసాయిరెడ్డి
పార్టీలకు అతీతంగా పోరాటం చేసి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేయడానికి తాను ముందు నిలబడతామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణకు బదులుగా దానిని తిరిగి లాభాల బాట పట్టించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.
కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
రైల్వే స్టేషన్ నుంచి జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న శాంతియుత నిరసన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని స్టీల్ ప్లాంట్ కార్మికులు చెబుతున్నారు. ఆటోలో వెళ్లే వారిని సైతం గుర్తించి అడ్డుకుంటున్నారని, హోటల్ నుంచి బయటకు రాకుండా సైతం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని కార్మికులు, పోరాట సమతి సభ్యులు వాపోయారు.
దీక్షలో విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు తెలుపుతున్న నిరసనలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. మీకు ఏ అన్యాయం జరగదని, అంతా మేలు జరుగుతుందని కార్మిక సంఘాల నేతలతో అన్నారు.
నిరసనలో పాల్గొన్న టీడీపీ ఎంపీలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు శాంతియుతంగా జరుపుతున్న నిరసనలో టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్‌లు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.