(Source: ECI/ABP News/ABP Majha)
Visakha Steel Plant Issue : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్తే నష్టపోయేది ప్రజలే - ఉండవల్లి
Visakha Steel Plant Issue : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మళ్లీ జరగాలని ఉండవల్లి, జేడీ లక్ష్మీనారాయణ, ఆర్.నారాయణ మూర్తి అన్నారు.
Visakha Steel Plant Issue : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మహాసదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కలపాలని సూచించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరట ఉన్న భూములను స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలన్నారు. స్టీల్ ప్లాంట్ పై పిల్ వేస్తే, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు ముడి వేస్తుందన్నారు. ఇంతకన్నా దారుణం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు. సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్లేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. కోర్టులో ప్రతిసారి సమయం అడుగుతూ కేసును వాయిదా వేస్తున్నారన్నారు. ఇందులో గెలిస్తే క్రెడిట్ అంతా విశాఖ ప్రజలకు చెందుతుందన్నారు.
పార్టీలన్నీ పోరాడాలి
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రధాని మోదీ మీకు దండం పెడుతున్నాం. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుపై ప్రజా ఉద్యమం కొనసాగాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎజెండా పక్కన పెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలి. వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగు బిడ్డగా పోరాటానికి కలిసి రండి. ఆంధ్రులు ఆరంభసరులే కాదు ప్రారంభ వీరులను విషయాన్ని కూడా కేంద్రం గుర్తుపెట్టుకోవాలి."- ఆర్.నారాయణ మూర్తి
మళ్లీ బ్రిటీష్ పాలన విధానం
ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్లిపోవడం వల్ల నష్టపోయేది ప్రజలు మాత్రమే అన్నారు. సోషలిస్ట్ నుంచి క్యాపిటల్ లిస్ట్ కి వెళ్లాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించాలని ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అందరూ సమిష్టిగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని సూచించారు. బీజేపీది క్యాపిటలిస్ట్ విధానం అన్నారు. దేశాన్ని అమ్మేస్తున్న వాళ్లని, వారి విధానంపై చర్చించాలని సవాల్ చేశారు. పబ్లిక్ సెక్టార్ లో ఉండవలసింది దేశం కోసం తప్పితే వేరొకరి కోసం కాదన్నారు. బ్రిటిష్ కాలం నాటి పరిపాలన మళ్లీ తీసుకొచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరు మీదే విశాఖ నగరానికి ఉక్కు నగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3. 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా మరో లక్షమంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి పని చేస్తున్నారు. అయితే ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించు కోవడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమీ దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదంటున్నారు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా సంస్థ నష్ఠాలను నమోదు చేస్తుందంటున్నారు. వాటిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.