MP Vijaysai Reddy : చంద్రబాబుకు ఆల్జీమర్స్, అయ్యన్న పాత్రుడు మోస్ట్ వాగుడుకాయి - ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్స్
MP Vijaysai Reddy : మధురవాడ ఐటీ సెజ్ ఎన్సీసీ భూముల విషయంలో అసత్య ప్రచారాలు చేశారన్న కారణంతో ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ నేతలు, పలు మీడియా సంస్థలపై ఫిర్యాదు చేశారు.
MP Vijaysai Reddy : విశాఖ మధురవాడ ఐటీ సెజ్ ఎన్సీసీ భూముల విషయంలో తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ, పలువురి టీడీపీ నేతలు మూడు మీడియా సంస్థలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎం పాలెం పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆయన స్వయంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయి రెడ్డి... చంద్రబాబు హయాంలోనే NCC భూముల లావాదేవీలు జరిగాయన్నారు. చంద్రబాబు తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబే అని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు ఆల్జీమర్స్ తో బాధపడుతున్నారని అందుకే పాత విషయాలు మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
చింతకాయ కాదు మిరపకాయలు
దేవుడు ఆయుష్షు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు రాజకీయాలు చేయాలని ఎంపీ విజయసాయి అన్నారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను ఓ వర్గానికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఆ భూముల విలువ కనీసం రూ.10 వేల కోట్లు ఉంటాయన్నారు. భూముల అక్రమాలను సహించేది లేదన్న ఆయన.. భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటామన్నారు. సుజనా చౌదరి ఆర్ధిక నేరస్థుడని, అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయి, ఆయన ఇంటి పేరు చింతకాయ కాదు మిరపకాయలు అని విజయసాయి రెడ్డి అన్నారు. అయ్యన్న తాగితే మనిషి కాదు రాత్రీ, పగలు తాగుతునే ఉంటారని తీవ్రంగా మాట్లాడారు. అయ్యన్న, ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి మోసాలపై ఈ.డీకి ఫిర్యాదు చేస్తానని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
నా అల్లుడికి వాటాలు లేవ్
టీడీపీ ఆరోపణలు చేసి జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీ మురళీ, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీలో తన అల్లుడికి వాటాలు ఉన్నాయనేది అసత్య ప్రచారమన్నారు. ఈ భూముల వ్యవహారంల ఎటువంటి సంబంధం లేని తన అల్లుడుని, కుటుంబాన్ని, తన పార్టీపై ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులను ఎండగడతానని ఎంపీ అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. క్రిమినల్, సివిల్ డిఫమేషన్ కేసులు వేస్తానన్నారు.
Also Read : Why Jagan Looses Cool : ఢిల్లీ వెళ్ళాక ఏం జరిగింది ? ముఖ్యమంత్రి మాటల వెనుక మర్మం ఏంటి ?