Minister Gudivada Amarnath : మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన, మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
Minister Gudivada Amarnath : మరో రెండు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Minister Gudivada Amarnath : విశాఖ కేంద్రంగా పాలనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని ప్రకటించారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో రెండో రోజు కొనసాగుతున్న ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను విశాఖలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ చేయడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
మూడు రాజధానులపై మరోసారి బిల్లు
ఏపీలో మూడు రాజధానులపై చర్చ కొనసాగుతూనే ఉంది. విశాఖ కేంద్రంగా పాలనపై మంత్రులు క్లూస్ ఇస్తూనే ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాజధాని ఏర్పాటుపై సమయం దొరికినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేస్తారని గతంలో చెప్పిన మంత్రి అమర్నాథ్, తాజాగా మార్చి నుంచే పాలన ప్రారంభం అంటూ మరో క్లూ ఇచ్చారు. అయితే మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం... బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటుంది వైసీపీ ప్రభుత్వం.
మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ విశాఖ నుంచి పాలనకు రూట్ క్లియర్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తరచూ లీక్ లు ఇస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే... నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అవుతాయని తాజాగా ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై ఆసక్తి నెలకొంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లును తిరిగి పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం కూడా లేకపోలేదు. మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుల కన్నా ముందే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.
ఏప్రిల్ నుంచి పాలన అంటూ గతంలో వ్యాఖ్యలు
విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రుల కామెంట్స్, ప్రభుత్వ పర చర్యలు చూస్తుంటే మరో రెండు, మూడు నెలల్లో విశాఖ రాజధానిగా పాలన ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి . ఫిబ్రవరి తరువాత ఏ క్షణమైనా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ సంకేతాలు ఇస్తుంది.