Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
Visakha G20 Summit : జీ20 సదస్సు విశాఖ రెడీ అయింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 69 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొనున్నారు.
Visakha G20 Summit : జీ20 సదస్సుకు విశాఖ వేదికైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటుచేశారు. ఈ నెల 28, 29 రెండు రోజులు పాటు విశాఖ నగరంలో జీ 20 సదస్సు జరుతుందని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. రెండు రోజులు మొత్తం 7 సెషన్స్, ఒక వర్క్ షాప్ జరుగుతాయని వెల్లడించారు. 69 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 28వ తేదీ సాయంత్రం గాళ డిన్నర్ కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతున్నారన్నారు. మొదటి రోజు నాలుగు, రెండవ రోజు మూడు సెషన్లు ఉంటాయన్నారు. 30న జీ 20 దేశాలు నుంచి వారికి ట్రైనింగ్ క్లాస్ లు ఉంటాయన్నారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. 31వ తేదీన దేశ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులతో సౌత్ కొరియా, సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలెజ్డ్ ఎక్సేంజ్ ఉంటుందన్నారు. పట్టణీకరణ ద్వారానే 80 శాతం జీడీపీ వస్తుందని సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. జీడీపీ వృద్ధికి కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పపనపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
వైజాగ్ లో మళ్ళీ పోలీస్ ఆంక్షలు మొదలయ్యాయి . ఈ నెల 28, 29, 30 తేదీలలో విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకముగా జరగనున్న జీ-20 అంతర్జాతీయ సదస్సు సందర్బంగా నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ ఇతర అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. తరువాత విశాఖలో ఆ తేదీల్లో ఎలాంటి ఆంక్షలు విధిస్తారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది ధరించవలసిన యూనిఫారం, సదస్సు వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాటించవలసిన నియమాలు, ట్రాఫిక్ మరియు ఇతర విధుల నిర్వహణలో పాటించాల్సిన రూల్స్ గురించి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విధులను నిర్వహించే విధానాలను గురించి పోలీసులకు ఇప్పటికే ట్రైనింగ్ ఇప్పించినట్టు ఆయన చెప్పారు.
వైజాగ్ లో రెడ్ జోన్ గా ప్రకటించిన మార్గాలు ఇవే :
విశాఖపట్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో
1)రాడిసన్ బ్లూ రిసార్ట్స్,
2)ముడసర్లోవ పార్క్,
3)కైలాసగిరి కొండ,
4)ఆర్.కె. బీచ్,
5)జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ రోడ్
6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధారలతో పాటు
G-20 సదస్సు కు హాజరుకానున్న ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో "తాత్కాలిక రెడ్ జోన్"గా ప్రకటించడమైనదని,ఈ నిషేధాన్ని ఉల్లంఘించి (డ్రోన్లు) సహా ఏవైనా సాంప్రదాయేతర వైమానిక వస్తువులు ఎగురవేసిన యెడల వాటిని నాశనం చేయడం తో పాటు IPC చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని సీపీ తెలిపారు. 27 వతేదీన G-20 ప్రతినిధులు పలు ప్రాంతాలను సందర్శిస్తారని, 28వ తేదీన గాలా డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయనీ, 29వ తేదీన ఉదయం యోగా కార్యక్రమం ఉంటుందనీ, జి-20 ప్రతినిధులు నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారనీ, అతిధులైన పలు దేశాల ప్రతినిధులు సందర్శించే రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశం ఉండదనీ ప్రజలకు పోలీసులు సూచించారు. ప్రజలకు అలానే సదస్సుకు హాజరయ్యే వారికి ట్రాఫిక్ లో అసౌకర్యం, అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశామని, కనుక ఈ నెల 28, 29, 30 తేదీలలో రాడిసన్ హోటల్ పరిసర ప్రాంతాలు, బీచ్ రోడ్, ఇతర జంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున నగరవాసులు పోలీసులకు సహకరిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి వైజాగ్ పోలీసులు తెలిపారు.