Vizag MP : భూ దందా నిజం కాదు - విశాఖ ఎంపీ లీగల్ నోటీసులు !
ప్రముఖ మీడియాపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. తనపై భూదందా ఆరోపణలు ఆధారాల్లేకుండా చేశారన్నారు.
Vizag MP : విశాఖలో వైఎస్ఆర్‌సీపీ నేతలు భూదందాలకు దిగుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూర్మన్న పాలెంలో ఓ డెలవప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని అందులో స్థల యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే ఇచ్చి తాను 99 శాతం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీకే చెందిన మరో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మీడియా చెప్పింది. అయితే ఇదంతా అవాస్తవమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ లీగర్ నోటీసులు పంపుతున్నట్లుగా ప్రకటించారు.
కూర్మన్నపాలంలో ఎ.10.57సెం ల భూమి వ్యాపార లావాదేవీలు 2012లో మొదలై భూ యజమానులతో అగ్రిమెంట్ 2018 జనవరి 8న జరిగిందని ఎంవీవీ సత్యనారాయణ చెబుతున్నారు. అప్పటికి నేను పార్లమెంటు సభ్యుడను కాదు. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడను కూడా కాదు. ఎందుకంటే నేను పార్టీలో చేరిందే 2018 మేలో. ఒక వ్యాపారిగా సదరు భూమికి చెందిన ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని నిర్మాణం మొదలుపెట్టామన్నారు. ఈ భవనానికి జీవీఎంసీ 2019 మార్చిలో అనుమతులిచ్చిందన్నారు.
కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్ లేబర్ బోర్డు (డీఎల్‌బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న నన్ను 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారని ఎంపీ తెలిపారు. ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అందుకు వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్ చేశారు. కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో 2017లో ఒప్పందం చేసుకున్నారు. వారికి వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంఓయు కుదిరిందని ఎంపీ తెలిపారు.
ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నామని.. . ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు. ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించిందని తెలిపారు. ఇందులో ఎక్కడా కుంభకోణాలు , అక్రమాలు జరగలదేని అందుకే.. పరువు నష్టం దావా వేస్తున్నామని ఎంపీ తెలిపారు.
వైఎస్ఆర్‌సీపీ ఎంపీల మధ్య విశాఖలో ఏర్పడిన వివాదం వల్ల బయటకొస్తున్న విషయాలను చెబుతున్న మీడియాపైనా వారు పరువు నష్టం కేసులు వేస్తూండటం చర్చనీయాంశంగా మారింది. అయితే అందరూ ఆరోపిస్తున్న విషయాలకు.. .కేవలం మీడియాకు మాత్రమే ఎంపీ నోటీసులు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.