Mithun Reddy Remand Report: లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారులలో మిథున్ రెడ్డి! వైసీపీ ఎంపీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Remand For YSRCP MP Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

Andhra Pradesh Liquor Scam Case | విజయవాడ: ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి (Mithun Reddy)కి విజయవాడలోని ఏసీబీ కోర్డు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. ఏపీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్ట్ చేశారని తెలిసిందే. రాత్రి ఏసీబీ ఆఫీసులోనే మిథున్ రెడ్డి ఉన్నారు. ఆదివార ఉదయం విజయవాడలోని ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి పై SIT, ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది.
మిథున్ రెడ్డి (Mithun Reddy)పై నమోదైన సెక్షన్లు
- IPC సెక్షన్లు 409, 420, 384, 201, 120 (B) తో పాటు సెక్షన్లు 34 & 37 కింద Cr. నెం. 21/2024.
- అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్లు 7, 7A, 8, 12, 13 (1) (B), 13 (2).
లిక్కర్ లేబులింగ్, ధర నిర్ణయించడం, బ్రాండింగ్, IMFL డిమాండ్ & సరఫరా, డిస్టిలరీలు, ఆర్డర్ ఫర్ సప్లై (OFS), లాజిస్టిక్స్, GROల ద్వారా మద్యం అమ్మకాలుతో ఎక్సైజ్ విధానాన్ని రూపొందించి కమీషన్లు/కిక్‌బ్యాక్‌ల రూపంలో సభ్యులకు అక్రమ ధన లాభం చేకూర్చడానికి ఒక సిండికేట్‌తో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. అక్టోబర్ 2019 నుండి మార్చి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ, ఇతర ప్రభుత్వ ఆఫీసులు, ప్రదేశాలలో నేరాలు జరిగాయి. ఆగస్టు 26, 2024న, యేది వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ఎక్సైజ్)కి ఒక ఫిర్యాదు చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర
- వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ కుట్రకు, మద్యం సిండికేట్ కార్యాచరణ రూపకల్పనకు ప్రధాన సూత్రధారులలో ఒకరు. ప్రధాన కార్యనిర్వాహకులలో ఒకరు.
- పెద్ద ఎత్తున కిక్‌బ్యాక్‌ల కోసం నిర్దిష్ట డిస్టిలరీలు, బ్రాండ్‌లకు అనుకూలంగా ఎక్సైజ్, మద్యం కొనుగోలు విధానాలలో విధాన స్థాయి మార్పులను రూపొందించారు.
- A.4 ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లేదా APSBCLలో అధికారికంగా పదవి ఉండకపోయినప్పటికీ, ఆయన కీలక విధాన నిర్ణయాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపారని దర్యాప్తులో వెల్లడైంది.
- ఆయన ఆదేశాల మేరకు, APSBCL కొనుగోలు వ్యవస్థ ఆటోమేటెడ్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) సిస్టమ్ నుండి మాన్యువల్, ఇమెయిల్ ఆధారిత ఆర్డర్ ఫర్ సప్లై (OFS) పద్ధతికి మార్చారు. ఇది డేటా ఆధారిత కొనుగోలును అధిగమించడానికి విచక్షణాధికారాన్ని కల్పించింది.
- ఎక్సైజ్ రంగంలో చాలా తక్కువ అనుభవం ఉన్న A.3 (శ్రీ సత్య ప్రసాద్)ను APSBCLకు స్పెషల్ ఆఫీసర్‌గా A4 మిథున్ రెడ్డి నియమించటం, బ్రాండ్ ప్రమోషన్, కొన్ని సరఫరాదారుల అణచివేత, OFS యొక్క ఏకపక్ష పునఃపంపిణీకి సంబంధించిన ఆదేశాలను అమలు చేసే విధేయుడైన అధికారిని నియమించడానికి ఒక పథకం.
- అక్టోబర్ 8, 2019న సత్య ప్రసాద్ (A-3) మిథున్ రెడ్డిని కలిసినప్పుడు, సరఫరాదారులు, డిస్టిలరీల నుండి కమీషన్లు, కిక్‌బ్యాక్‌లు సంపాదించడానికి తమ ప్రతిపాదనను వివరించారు. మిథున్ రెడ్డి A3 సత్య ప్రసాద్‌ని తమ సిండికేట్ కోసం పనిచేయాలనిని కోరారు, 2023లో IAS పదోన్నతి ఇస్తానని వాగ్దానం చేశారు.
- అక్టోబర్ 13, 2019న హైదరాబాద్‌లోని విజయసాయి రెడ్డి ఇంటి వద్ద మిథున్ రెడ్డితో సహా సిండికేట్ సభ్యులు సమావేశమయ్యారు. గత 3 సంవత్సరాల మద్యం అమ్మకాల డేటాను విశ్లేషించిన తర్వాత, ప్రతి నెలా ₹50-60 కోట్ల కమీషన్లు/కిక్‌బ్యాక్‌లు సంపాదించవచ్చని వారు అంచనా వేశారు.
- మాన్యువల్ OFS ప్రక్రియతో డిపోలలో సరఫరా, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లలో (GRO) అమ్మకాలను A3 సత్య ప్రసాద్ నిర్వహించాలని నిర్ణయించారు.
- కిక్‌బ్యాక్‌లు చెల్లించే మద్యం బ్రాండ్‌లు, కంపెనీలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించాలని సిండికేట్ అంగీకరించింది.
- మిథున్ రెడ్డి సహచరుల ద్వారా సమావేశాలలో నగదు వసూలు చేసి పంపిణీ చేశారు
- SPY డిస్టిలరీస్, Sanhoc ల్యాబ్స్, D-Cart లాజిస్టిక్స్ వంటి సంస్థల మధ్య ₹60 కోట్లు బదిలీ అయ్యాయి. D-Cart లాజిస్టిక్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమీక్షించేటప్పుడు, అక్టోబర్ 3, 2021న PLR ప్రాజెక్ట్‌ల ఖాతాలో ₹5 కోట్లు జమ అయినట్లు గుర్తించారు. ఈ కంపెనీ మిథున్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులకు చెందినది.
- ఆయన G.O.Ms.No.401ని ఉల్లంఘించి, ధరలు, డిస్కౌంట్లు, బ్రాండ్ ఆమోదాలు వంటి APSBCL విధానాలను ఆదేశించారు. "సారూప్య బ్రాండ్‌లను" దుర్వినియోగం చేసి ధరలను పెంచారు.
- ఈ సిండికేట్ కార్యకలాపాల ద్వారా సుమారు ₹3,200 కోట్ల అక్రమ లాభాలు అంచనా వేశారు.
లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది
- ఆటోమేటెడ్ OFS వ్యవస్థ నుంచి మాన్యువల్ వ్యవస్థకు మార్చడం.
- కిక్‌బ్యాక్‌లు చెల్లించే కొన్ని కొత్త బ్రాండ్‌లకు ప్రాధాన్యతతో కూడిన OFS కేటాయింపు. కిక్‌బ్యాక్‌లు చెల్లించడానికి నిరాకరించిన ఫేమస్ బ్రాండ్‌లను అణచివేయడం.
- ఇండెంట్ ప్రణాళికలను తారుమారు చేయడం, GRO లాగిన్‌లను నియంత్రించడం.
- సరఫరాదారులకు ₹200 కోట్లకు పైగా అదనపు చెల్లింపులు (జూన్ 2022 నుండి మార్చి 2024 వరకు) 1.5% డిస్కౌంట్ ద్వారా జరిగాయి. వారికి ధన లాభం చేకూరడం అదే సమయంలో APSBCLకు నష్టం వాటిల్లింది. ఈ అదనపు చెల్లింపులు ప్రధానంగా SPY Agro Industries, Amber Spirits, Leela Distilleries, Adan Distilleries, SNJ Suppliers/Distilleries, Tilaknagar, Sentini, Mohan ఇతర సరఫరాదారులకు జరిగాయి.
- కిక్‌బ్యాక్‌లు బాలియన్ వ్యాపారులు, షెల్ కంపెనీలతో పెంచిన లావాదేవీల ద్వారా దాచిపెట్టారు. నిధులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లోని హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా షెల్ కంపెనీలకు లేదా నిందితులకు చేరాయి
లిక్కర్ కేసు విచారణ
సిట్ అధికారులు ఇప్పటివరకూ 74 హార్డ్ డిస్క్‌లు, ఒక ల్యాప్‌టాప్, 1,016 డాక్యుమెంట్లు/ఫైళ్లు స్వాధీనం చేసుకుని FSL విశ్లేషణకు పంపించారు. ఇప్పటివరకు 270 మంది సాక్షులను విచారించారు. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించడం లిక్కర్ స్కామ్ జరిగిన తీరును బహిర్గతం చేసేందుకు చాలా కీలకమని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డికి సెక్షన్ 41A BNSS కింద నోటీసు జారీ చేసి, జూలై 19న అతని అరెస్టు గురించి తెలియజేశారు.






















