Kodi Kathi Case: కోడికత్తి కేసులో ట్విస్ట్- విశాఖ NIA కోర్టుకు కేసు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
Kodi Kathi case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నాలుగేళ్ల కిందట జరిగిన కోడి కత్తిదాడి కేసు విచారణ విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు.
Kodi Kathi case To Vizag NIA Court: కోడి కత్తి శ్రీను కేసు విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ అయింది. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన ఈ కోడి కత్తి దాడి కేసును విచారించిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు.. కేసును విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8వ తేదీకి తదుపరి విచారణ జరగనుంది. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది.
80 శాతం కేసు వాదనలు పూర్తి చేసుకున్న కేసును ఇప్పుడు బదిలీ చేయడం ఏంటని కోడి కత్తి శ్రీను తరపు లాయర్ గగన సింధు ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బాధితుడు శ్రీనివాసరావుకు అన్యాయం చేయడమే అన్నారు. కేసు విచారణ దాదాపుగా పూర్తయిందని, ఈ సమయంలో కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదన్నారు. తమ వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తాం అని కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందన్నారు. అయితే కేసు విచారణ పూర్తి కావాలంటే, ఏపీ సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉందని గగన సింధు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో జగన్ తరపు న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు ఏమన్నారంటే?
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో తదుపరి దర్యాప్తు కోసం వేసిన పిటీషన్ పై వాదనాలు జరిగాయని న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు తెలిపారు. 2019 జనవరి 1న ఎన్ఐఎ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిందన్నారు. దీనిలో భాగంగా సాక్షులను విచారించిందన్నారు. ఎన్ఐఎ జగన్ ను విచారించిన సమయంలో చాలా విషయాలు ఎన్ఐఎ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. జగన్ తెలిపిన విషయాలపై ఎన్ఐఏ ఎటువంటి విచారణ జరపకుండా 2019 జనవరి 23న ఛార్జీషీట్ దాఖలు చేశారన్నారు. జగన్ వేసిన పిటీషన్ పై కుట్రకోణం లేదంటూ ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసిందన్నారు. ఈ కేసును ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు ఏఈపీ ఇచ్చే సమయంలో పూర్తి స్థాయి విచారణ చేసి ఇవ్వాలని కోరామన్నారు. కానీ ఎటువంటి విచారణ చేయాలని జగన్ తరఫు న్యాయవాది ఆరోపించారు.