Vasireddy Padma: యుద్ధానికి వచ్చారా? పరామర్శకా? చంద్రబాబుకు ఏమీ చేతకాదు - వాసిరెడ్డి పద్మ
తనపై అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు దూషించారని వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తుండగా, ఆమెనే తమను తిట్టారని, దాడి చేయబోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన వేళ బాధితురాలిని టీడీపీ, వైసీపీ నేతలు పరామర్శించిన వ్యవహారంలో ఇరు పార్టీల మధ్య దుమారం రేగుతోంది. నిన్న (ఏప్రిల్ 22) టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి ఒకే సమయంలో బాధితురాలి పరామర్శకు వచ్చినప్పుడు ఇరు వర్గాలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తనపై అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు దూషించారని వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తుండగా, ఆమెనే తమను తిట్టారని, దాడి చేయబోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నేడు వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.
‘‘బాధితుల్ని పరామర్శించడం చంద్రబాబుకు తెలియదు. నిన్న ఆస్పత్రిలో బాధితురాలి మంచం దగ్గర కూడా 50 మంది ఉన్నారు. ఒక అత్యాచార బాధితురాలికి ఇలా ఎవరైనా పరామర్శలు చేస్తారా? అత్యాచారం జరిగితే రాజకీయం చెయ్యడం కాదు. రాజకీయం కన్నా మానవత్వం మరిచారనే మేం మహిళా కమిషన్ తరపున నోటీసులు ఇచ్చాము. అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా.. ఒక మహిళా కమిషన్ చైర్ పర్సన్‌పై ప్రవర్తించే తీరు ఇదేనా? రాష్ట్రంలో ఉన్న మహిళలకు నేను ప్రతినిధిని. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి?
సాక్షాత్తు గతంలో చంద్రబాబు హయంలో బాధితురాలి విషయంలో రాజకీయాలు చేశారు. చంద్రబాబు వైఖరిపై సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారా. నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పరిణామాలపై కొన్ని వాస్తవాలు తెలియాలి. మహిళా కమిషన్ ఒక వ్యవస్థ. మహిళలకు భద్రత ఉండాలని ఏర్పాటు చేసింది.. మహిళా కమిషన్. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతుమంత్రంగా ఉంది. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నాడు. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళ కమిషన్ సుప్రీమ్. 27న చంద్రబాబు, బోండా ఉమ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి 4 కోట్ల మందికి సమాధానం చెప్పాలి. ఏ చట్ట ప్రకారం మహిళా కమిషన్ ఉందో మీకు తెలియదా? నా మీదే నిందలు వేస్తారా? యుద్హానికి వచ్చారా.. పరామర్శకు వచ్చారా?’’ అంటూ వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు.