ఆ పేరు చాలంటున్న వంగవీటి రాధా- ఘనంగా రంగా వర్ధంతి!
పదవులు ఉన్నా లేకున్నా, వంగవీటి రంగా కుమారుడనే పేరు చాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. కులమతాలకు అతీతంగా తన తండ్రిని పేదలు ఆదరించటం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమని కామెంట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్ధంతి వేడుకలను ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన వర్ధంతి నాడే విశాఖ కేంద్రంగా మాజీ మంత్రి గంగా శ్రీనివాసరావు భారీ సభకు ప్లాన్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా రంగా వర్ధంతిని నిర్వహిస్తున్నారు. రంగా సేవలను రాజకీయ నేతలు కొనియాడుతున్నారు. చనిపోయి దశాబ్దాలు గడిచినా మరపురాని ప్రజానేత రంగా అని పలువురు వక్తలు కీర్తించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన రంగా మహనీయుడని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పని చేసింది కొంతకాలమే అయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
వాడ వాడలా రంగా విగ్రహాల ఆవిష్కరణలు
ఏపీలోని అనేక ప్రాంతాల్లో రంగా విగ్రహాలను ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతం నున్న గ్రామంలో రంగా అభిమానుల నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సభలో వారు మాట్లాడుతూ వంగవీటి రంగా మరణించి 34 ఏళ్ళు గడిచిన ఆయనపై ప్రజలకు అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. పేదల కోసం జీవించి వారితో మమేకమై బతికిన రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారున్నారు. ఎమ్మెల్యేగా కొన్నాళ్లే పని చేసినా పేద ప్రజల సమస్యలపై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రంగా ఎదుగుదలను ఆపేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రత్యర్ధులు చివరకు ఆయన్ను మట్టుపెట్టారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు రంగా అని వారు నివాళులర్పించారు.
ఆయన కుమారుడిగా పుట్టాను అదే చాలు: వంగవీటి రాధా
రంగా ఏ ఒక్క ప్రాంతానికో, కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. ఎవరైనా దూరమైతే కొద్ది కాలానికే మర్చిపోవడం సహజమన్నారు. గతించి 34 సంవత్సరాలు గడచినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన రంగా తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎన్ని పదవులు చేపట్టినా లభించని సంతృప్తి, అభిమానం, రంగా తనయుడిగా తనకు దక్కాయన్నారు. ఈ సందర్భంగా 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తొలుత అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా సభాస్థలికి తరలివచ్చారు. బాణాసంచా కాల్పులు, డీజే వాయిద్యాలు నడుమ యువత బైక్లపై విన్యాసాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
రంగా వర్ధంతిలో మూడు పార్టీలు
వంగవీటి మోహన్ రంగా 34 వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఘనంగా పార్టీలన్నీ నివాళులర్పించాయి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం, ఇళ్ల పట్టాల కోసం, లాకప్ డెత్ అంశంపై బలంగా పోరాటం చేసి... ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తుది వరకూ ఫలితం కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని జనసేన నేత పొతిన మహేష్ అన్నారు. వంగవీటి రాధాకృష్ణని తొమ్మిది సంవత్సరాల పాటు రాజకీయంగా ఉపయోగించుకొని వదిలేసిన పార్టీ వైఎస్ఆర్సిపి అని మండిపడ్డారు. రాధాకృష్ణపై రెక్కీ నిర్వహించినప్పుడు స్పందించని నాయకులు నేడు పదవులు డబ్బు అంటూ కావాలని రాజకీయ లబ్ధి పొందాలని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అటువంటి వ్యక్తులకు వంగవీటి రంగా అభిమానులు రాధాకృష్ణ అభిమానులు మద్దతు ఇవ్వరని తెలిపారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిజంగా చెత్తశుద్ధి ఉంటే వంగవీటి రంగా స్మృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలి ఏదో ఒక పథకానికి వారి పేరుని ప్రకటించాలన్నారు.