Perni Nani: అదే జరిగితే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా - కలెక్టర్‌ను నిలదీస్తూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
అసలు జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు ఉందా లేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ మండిపడ్డారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా సమావేశంలో అందరి ముందే నిలదీశారు. ఉమ్మడి క్రిష్ణా జెడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లా కలెక్టర్ తరచూ గైర్హాజరవుతున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు ఉందా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ మండిపడ్డారు. మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం వారికి లేకపోతే జెడ్పీటీసీలతో కలిసి సీఎం ఇంటి ముందు నిరసన తెలియజేస్తామని, ఈ మేరకు కలెక్టర్ కు లేఖ రాయాలని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికను డిమాండ్ చేశారు.
బుధవారం (జూలై 19) ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఇతరులు హాజరు అయ్యారు. గతంలో క్రిష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో ఎమ్మెల్యే పేర్ని నాని అగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు కలెక్టర్ ప్రసన్నం వెంకటేష్ మరోసారి జెడ్పీ సమావేశానికి రాకపోతే కనుక జిల్లాకు చెందిన జెడ్పీటీసీ మెంబర్లందరితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తామంటూ పేర్ని నాని అందరి ముందే వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సమావేశంలో తీర్మానం కూడా చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కు లేఖ రాయలి జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికను కోరారు.