AP Minister Peddireddy: చంద్రబాబు తరపున పురందేశ్వరి మాట్లాడినా నో ప్రాబ్లమ్, కానీ! మంత్రి పెద్దిరెడ్డి సలహా ఏంటంటే
Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Peddireddy Ramachandra Reddy: బీజేపీ- ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్‌లోని కనకదుర్గా నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌లను మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో స్థలం దొరకడం కష్టంగా మారిందని.. అయినప్పటికీ రూ.20.34 కోట్లతో మూడు ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మించినట్లు మంత్రి చెప్పారు. గతంలో కృష్ణలంక కరకట్ట రక్షణ గోడ నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యను గుర్తించారని, ముంపు బాధితుల సమస్యను పరిష్కరించేలా రక్షణ గోడ నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కరకట్ట నిర్మాణం కోసం కోట్లు కేటాయించి అక్కడి ప్రజల సమస్యని పరిష్కారం చేశారని పెద్దిరెడ్డి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామన్నారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదని మంత్రి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆరోపణల్లో నిజం లేదన్నారు. కష్టపడి పనిచేసే నాయకుడు దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని.. వైసీపీని గెలిపించి దేవినేని అవినాష్‌ను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే ఇబ్బంది లేదన్నారు. అయితే మద్యం డిస్టలరీలపై ఆమె వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనన్నారు. మద్యంపై చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితేనే మంచిదన్నారు. కానీ బీజేపీలో పని చేస్తున్న పురందేశ్వరి బీజేపీ తరఫున వకల్తా పుచ్చుకుని టీడీపీకి పని చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో డిస్టలరీలన్నీ చంద్రబాబే మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డిస్టెలరీకి అనుమతులు ఇవ్వలేదన్నారు. బీజేపీలో ఉన్న నేతలకే పురందేశ్వరి తీరు నచ్చడం లేదని, చంద్రబాబు వదినగా ఆయనకు మద్దతు తెలుపుకోవచ్చన్నారు. కానీ రాష్ట్రంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటదని హితవు పలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. జైలు నుంచి వచ్చిన మరుక్షణమే సంబరాలు, ర్యాలీలు నిర్వహించారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. పరామర్శల పేరుతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కోర్టు అన్ని విషయాలు గమనిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని ఆరోపించారు. చేసిన అవినీతి పనులకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదన్నారు.