Mango Fruits: మామిడి పండ్ల ను కొంటున్నారా ... అయితే ఇది మీకోసమే .. !
ఫలాల రాజా ఎవరు అంటే మామిడి అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. మామిడి పండ్ల రేంజ్ అది. అలాంటి పండ్లు ఇప్పుడు విషపూరితంగా మారుతున్నాయి.
మామిడి పండు అంటే ఇష్టం లేని వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తాడు. వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌కు వెళ్లి తమ స్థాయికి తగ్గట్టు పండ్లు కొనుక్కొని వచ్చి లాగించేస్తు ఉంటారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి చోట మనకు మామిడి పండు కనిపిస్తుంది. భోజనం కాగానే ఒక ముక్క అయినా మామిడి రుచి తగలాలి అనుకునేవారు కొందరైతే .. ఉదయాన్నే చద్దన్నంతోపాటు కలిపి మామిడి పండు తినేవారు మరి కొందరు. పిల్లలైతే మామిడి పండును చూడగానే ముక్కలుగా కోసుకునో.. జ్యూస్‌గా మార్చేసో లాగించేస్తూ ఉంటారు.
ప్రస్తుతం మనకు మార్కెట్‌లో కనిపించే పసుపు పచ్చగా ఉండే మామిడి పండ్లు విషతుల్యంగా మారిపోతున్నాయన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న కలర్‌ఫుల్ మామిడి పండ్లు తింటే ఆరోగ్యం హరీ అంటుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మార్కెట్‌లో కనిపిస్తున్న మామిడి పండ్లు మాత్రం సహజ సిద్ధంగా పండినవాటి కంటే కార్బైడ్ వాడి కృత్రిమంగా పండించినవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
కార్బైడ్ వాడితే తొందరగా పండడంతోపాటు మంచి రంగుతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటాయని కొందరు మామిడి పళ్ళను రసాయనాలతో ముంచెత్తుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌లోకి మామిడి పండ్లు చాలా ఆలస్యంగా వచ్చాయి. అది కూడా చాలా తక్కువ మోతాదులో వచ్చాయి. దానితో వచ్చిన పండ్లను కార్బైడ్ లాంటి రసాయనాలు వాడి మగ్గ బెడుతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సహజంగా మగ్గాలంటే మామిడికి 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. అదే కార్బైడ్ వాడితే రెండు రోజుల్లోనే పండ్లు మంచి రంగుదేలుతాయి. దానితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. చెట్టు నుంచి కాసిన కాయలను ఎండుగడ్డిలో వేసి గాలి తగలకుండా నిల్వ చేయడం వల్ల అవి సహజంగా మగ్గుతాయి. మొత్తం పండు అంతా చక్కటి పసుపు వర్ణంలో ఉంటాయి.
కృత్రిమంగా పండే పళ్ళను కాల్షియం కార్బైడ్ వాడి త్వరగా మగ్గేలా చేస్తున్నారు. పైగా ఇటీవల కురిసిన వర్షాలూ, వీసిన గాలులకు రాలిపోయిన మామిడి పండ్లను ఇలా బలవంతంగా మగ్గించి మార్కెట్‌లోకి దించుతున్నారు అనే ఆరోపణలు వినవస్తున్నాయి. రంగు బాగుంది కదా అని ఇలాంటి పండ్లను తింటే ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు.
గుర్తించడం ఇలా . . !
సహజ సిద్ధంగా పండిన మామిడి మొత్తం ఒకే రంగులో ఉంటుంది. రసాయనాలతో పండిన మామిడిపై అక్కడక్కడా ఆకుపచ్చ రంగులో మచ్చలు ఉంటాయి. సహజ సిద్ధంగా పండిన మామిడికి మంచి వాసన ఉంటుంది. రసాయనాలు వాడిన మామిడికి వాసన తక్కువ ఉంటుంది. సహజ సిద్ధంగా పండిన మామిడి తింటే దాని రుచి చాలా మధురంగా ఉంటుంది. రసాయనాలు వాడిన పండ్లు తింటే గొంతులో మంటగా ఉంటుంది. సహజ సిద్ధంగా పండిన మామిడిలోని గుజ్జు కాస్త కాషాయ వర్ణం కలిసిన పసుపు ఉంటుంది. కృత్రిమంగా పండిన మామిడిలోని గుజ్జు కాస్త తెలుపు కలసిన పసుపు రంగులో ఉంటుంది. పైగా రసం తక్కువగా వస్తుంది.
కార్బైడ్ వాడడం చట్టపరంగా నేరం :
ఆహార భద్రత చట్టం-1955 ప్రకారం కాల్షియం కార్బైడ్‌ను వాడి పండ్లను మగ్గబెట్టడం నేరం. ఎవరైనా వ్యాపారులు గానీ, రైతులు గానీ కెమికల్ వాడిన మామిడి పళ్ళను మార్కెట్‌లో అమ్మితే కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛమైన పండ్లను రైతు బజార్లలో ఆమ్మేలా చర్యలు తీసుకున్నట్టు వారు అంటున్నారు. అయితే ప్రజలు మాత్రం మార్కెట్‌లో అమ్ముతున్న కార్బైడ్ మామిడి పండ్లను ఆపేందుకు ప్రభుత్వం నిరంతర నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు,