సంక్రాంతికి రెడీ అవుతున్న కోడి కత్తులు- నిఘా పెట్టిన ఖాకీలు
కోడి పందానికి ఉభయగోదావరి జిల్లాల ఎంత ఫేమస్ అయ్యాయో వాటిని కావాల్సిన కత్తిని తయారు చేసే ఉమ్మడి కృష్ణాజిల్లా కూడా అంతే ఫేమస్.
సంక్రాంతి పండుగకు కోడి కత్తులు రెడీ అవుతున్నాయి. భారీ ఎత్తున జరిగే కోడి పందాలకు అవసరం అయిన కొడి కత్తుల తయారీలో కుటీర పరిశ్రమలు బిజిగా ఉన్నాయి. చట్టప్రకారం కోడి పందాలు నిషేదం కావటంతో, కోడి కత్తులను తయారు చేసే కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి భారీ కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
కోడి కత్తికి ఉమ్మడి కృష్ణాజిల్లా ఫేమస్
కోడి పందానికి ఉభయగోదావరి జిల్లాల ఎంత ఫేమస్ అయ్యాయో వాటిని కావాల్సిన కత్తిని తయారు చేసే ఉమ్మడి కృష్ణాజిల్లా కూడా అంతే ఫేమస్. జిల్లాల విభజన తరవాత ఎన్టీఆర్ జిల్లా పరిదిలోకి కొడి కత్తి తయారు కేంద్రాలు వచ్చాయి. ప్రధానంగా తిరువూరు, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో కోడి కత్తి తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి.
సంక్రాంతి సీజన్ కోసం కోడి కత్తులను ఇక్కడ తయారు చేస్తుంటారు. కోడి కత్తిలో ఉన్న అన్ని రకాలు కూడా ఇక్కడ తయారు అవుతుంటాయి. సంక్రాంతి సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మూడు నెలల ముందుగానే ఇక్కడ కోడి కత్తులను తయారు చేస్తున్నారు. అయితే ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి, కోడి కత్తులను తయారు చేసే కేంద్రాలను సీజ్ చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో పెత్త ఎత్తున కోడి కత్తులు వెలుగు చూశాయి. పక్కను ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు ఇక్కడ నుంచే కోడి కత్తులను సరఫరా చేస్తుంటారు.
పందెం కోడికి కత్తి కట్టటం ఒక ఆర్ట్
పందెం బరిలో దిగే కోడికి కత్తిని కట్టడం కూడా ప్రత్యేకమైన విద్యగా భావిస్తుంటారు. కోడికి కత్తులను కట్టడంలో నిష్ణాతులయిన వారు కూడా ఉన్నారు. పందాల సమయంలో కూడా వారికి మంచి డిమాండ్ ఉంటుంది. బరిలో దిగే కోడికి కత్తిని ఎ డైరెక్షన్‌లో కట్టాలి, కాలుకు కత్తి కట్టిన సమయంలో ప్రత్యర్ది కోడికి కత్తి ఎక్కడ తగిలేలా చూడాలి అనే అంశాలు కూడా పందాల సమయంలో చాలా కీలకంగా భావిస్తుంటారు. దీంతో పందెం బరిలో దిగే కోడికి కత్తిని కట్టే విద్యను నేర్చుకున్న వారు కూడా పందాల సమయంలో బాగానే సంపాదిస్తారని చెబుతున్నారు.
భారీగా రెడీ అవుతున్న కోడి కత్తులు
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. తెలంగాణా మొదలుగొని తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు చేరుకుంటారు. అక్కడ ఉండి కోడి పందాల కోసం ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లి, కోట్లలో పందాలు వేయటం ఆనవాయితీగా వస్తుంది. చట్టప్రకారం కోడి పందాలపై నిషేదం ఉన్నప్పటికి ఆ సమయానికి పోలీసులు సైతం సైలెంట్ అయిపోవటం సంక్రాతి కోడి పందాలకు ఉన్న డిమాండ్‌ని స్పష్టం చేస్తుంది. సంక్రాంతి మూడు రోజులు మాత్రమే కాదు ఆ వారం అంతా, కూడా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జరుగుతుటాయి.
ఉభయ గోదావరి జిల్లాలో అయితే కోడి పందాలకు ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేస్తారు. కోట్లాది రూపాయలు పందెం బరిలో చేతులు మారుతుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే కోడి పందాల కోసం సంవత్సరం పొడువునా కోళ్ళను ప్రత్యేకంగా పంచుతుంటారు. పందెం బరిలో దిగిన కోడి కాలుకు కత్తి కట్టి ఉసిగొల్పితే,పోటా పోటీగా జరిగే పందాలను కళ్ళారా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున జనం గోదావరి జిల్లాలకు తరలి రావటం ఆనవాయితీగా వస్తుంది.