మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ- పవన్ ఏం చెప్పబోతున్నారు?
పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి బయల్దేరనున్నారు. ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహిపై బందరు చేరుకుంటారు. దీని కోసం జనసేన ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.
జనసేన పార్టీకి పదేళ్లు. ఆ పార్టీ ప్రారంభమై పదేళ్లు అయిన సందర్భంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది జనసేన. దీనిక అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తోపాటు కీలక నేతలంతా హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానుల వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సభ కోసం జనసేన విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభ కోసం పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి బయల్దేరనున్నారు. ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న ప్రచార రథం వారాహిపై బందరు చేరుకుంటారు. దీని కోసం జనసేన ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. దీన్నే పోలీసులకు కూడా ఇచ్చింది. అయితే ర్యాలిపై పోలీసులు అభ్యంతరం చెప్పడం వివాదమైంది. సభ వరకు అనుమతి ఉంది కానీ... ర్యాలీ, పాదయాత్రలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అధికారులు కాస్త తగ్గి కొన్ని మార్పులతో ఈ రూట్‌మ్యాప్‌కు అంగీకారం తెలిపారు.
బందరు శివారులో 35 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పది గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పార్కింగ్, భోజనాలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయల్దేరి వెళ్తారు. ఆటో నగర్ నుంచి బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహిస్తారు.
పవన్ ఏం చెబుతారు?
జనసేన పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయింది. గెలిచిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు ప్రకటించారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏం ప్రకటిస్తారనేది ఉత్కంఠగా ఉంది. పొత్తులపై ఏమైనా క్లారిటీ ఇస్తారు. లేకుంటే ఎప్పటి మాదిరిగానే సైలెంట్ అయిపోతారా అనేది కూడా ఓ చర్చ నడుస్తోంది.
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కూడా పవన్‌కు గిట్టడం లేదు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానంటూ ప్రతి వేదికపై చెబుతున్నారు. ఆ దిశగా ఏమైనా ప్రణాళిక ప్రకటన చేస్తారా అన్నది తేలాలి.
పవన్ యాత్ర చేస్తారంటూ గత ఏడాది కాలంగా వినిపిస్తున్న మాట. వారాహి సిద్ధం చేసుకుంది కూడా దాని కోసమేనంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే నారసింహ యాత్ర చేయబోతున్నట్టు కూడా పవన్ చెప్పుకొచ్చారు. దినిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడైనా ఈ యాత్రపై స్పష్టత వస్తుందా అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో కొన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ ప్రకటించిన పవన్... ఎవరైనా ఆహ్వానిస్తే కలిసి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై కూడా స్పష్టత ఇస్తారా అనేది చూడాలి. ఈ మధ్య బీఆర్‌ఎస్‌తో చర్చలు జరిగినట్టు విస్తృతంగా ప్రచారం నడిచింది. ఆ ఆరోపణలపై ఏమైనా మాట్లాడాతారా అనేది మరో ఉత్కంఠ. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాల కోసం జనసైనికులతోపాటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.
రాత్రి గవర్నర్‌తో పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా పని చేసిన అనంతరం రాష్ట్ర గవర్నర్‌గా రావడం ఆనందదాయకమన్నారు పవన్ కల్యాణ్. అందుకే ఆయన్ని మర్యాదపూరకంగా కలిసినట్టు చెప్పారు. తమ పార్టీ ప్రస్థానం, ఆలోచన విధానాన్ని గవర్నర్‌కు పవన్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.