జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు- కిడ్నాప్ కేసుల ఎఫెక్ట్‌తో చర్యలు
Guntur Government Hospital: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కిడ్నాప్ కేసులు ఎక్కువవుతుండటంతో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Guntur Government Hospital: గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఐదేళ్ల బాలుడిని మహిళ అపహరించుకుపోవటంతో మరోసారి జీజీహెచ్ లోని భద్రతా లోపాలు బయట పడ్డాయి. దీంతో జిల్లా కలెక్టర్ వేణు గోపాల రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఇద్దరూ కలిసి వివిధ విభాగాలను పరిశీలించారు. ఇప్పటికే జీజీహెచ్ లో ప్రైవేటు సెక్యూరిటీ 188 మంది ఉన్నారు. అయినప్పటికీ పలు చోట్ల దొంగతనాలు, పిల్లలను అపహరించుకుపోవడం, రోగుల సెల్ ఫోన్లు దొంగలించడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో భద్రత ఏర్పాట్లలో ఉన్న లోపాల గురించి సిబ్బందిని, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 19 లక్షల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి తెలిపారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్ లో దొంగతనాలు జరగకుండా కట్టడి చేసేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను జీజీహెచ్ లో ఉంచుతున్నట్లు ఎస్పీ హఫీజ్ చెప్పారు. జీజీహెచ్ కు ప్రతిరోజూ వేల సంఖ్యలో రోగులు, వారి బంధువులు వస్తుంటారని అటువంటి చోట ఎటువంటి భధ్రతా లోపాలు లేకుండా చూడాలన్న ఉద్ధేశంతోనే జీజీహెచ్ ను పరిశీలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
నాలుగు రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి బాలుడి అపహరణ
గుంటూరి జిల్లాలోని జీజీహెచ్ లో నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన బాలుడి ఆచూకీని పోలీసులు 24 గంటల్లోనే కనిపెట్టారు. బెల్లంకొండ మండలం మంచాయపాలేనికి చెందిన ప్రసాద రావు తన సోదరి కిజియాను ప్రసవానికి ఐదు రోజుల కిందడ జీజీహెచ్ లో చేర్పించారు. గురువారం ప్రసాదరావు కుటుంబ సభ్యులు బాలుడు వర్షిత్ తో సహా వరండాలో నిద్రించారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే బాలుడు కనిపించలేదని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం జీజీహెచ్ లోని సీసీ టీవీలను పరిశీలించగా.. ఓ మహిళ బాలుడిని జీజీహెచ్ నుంచి చేయి పట్టుకొని బయటకు తెచ్చి అపహరించుకుపోయినట్లు గుర్తించారు. కొద్ది రోజుల కిందట అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఓ బాలుడు అదృశ్యం అయ్యాడు. దీంతో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాలుడు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
కొత్తపేట అరండల్ పేట పోలీసులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి అనుమానితురాలి కోసం గాలించారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంలో ఆ మహిళ బాలుడితో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అరండల్ పేటలో అదృశ్యమైన మరో బాలుడిని ఆమె వద్ద గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా అరండల్ పేటలో అదృశ్యమైన మరో బాలుడిని ఆమె వద్ద గుర్తించినట్లు సమాచారం. సదరు అనుమానిత మహిళ గుంటూరు మిర్చియార్డు సమీపాన నివసిస్తుంటుందని చెబుతున్నారు. ఆమె వెనుక ఓ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితురాలితో పాటు ఇద్దరు బాలురను గుంటూరుకు తీసుకు వచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.