Gudivada Tensions: గుడివాడలో ఉద్రిక్తత, ఆయన్ని చంపుతామని బెదిరింపు కాల్! దమ్ముంటే టచ్ చేయాలని సవాళ్లు
Gudivada లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ గుడివాడ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకు కాల్ చేసి చంపుతామని వైసీపీ నేత బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Gudivada High Tension: ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రంగా వర్థంతి కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. రంగా వర్థంతి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగుమాల కాళీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు అంటున్నారు.
రావిని చంపేస్తామని బెదిరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దమ్ముంటే రావిని టచ్ చేయాలని కార్యకర్తలు సవాల్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగుతున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తేలేంతవరకు కదిలేది లేదంటూ టీడీపీ కార్యక్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ కార్యకర్తలు జై రావి అంటూ నినాదాలు చేస్తున్నారు. కవర్లతో పెట్రోల్ తీసుకువచ్చిన కొందరు యువకులు రోడ్లపైకి విసిరినట్లు తెలుస్తోంది.
దీంతో గుడివాడలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. అటు వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిన్న (డిసెంబరు 25) వైసీపీ నేతలు కలిసి గుడివాడలో రంగా విగ్రహం ఆవిష్కరించిన ఆయన కుమారుడు రాధా.. తాజాగా విజయవాడలో టీడీపీ, జనసేన నేతలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా సమక్షంలో వైఎస్ఆర్ సీపీని టీడీపీ నేతలు బండబూతులు తిట్టారు.
జనసేన కూడా..
వంగవీటి మోహన రంగా 34 వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణతో కలిసి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం, ఇళ్ల పట్టాల కోసం, లాకప్ డెత్ అంశంపై బలంగా పోరాటం చేసి ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తుదివరకూ ఫలితం కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అని వారు గుర్తు చేసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణను 9 సంవత్సరాల పాటు రాజకీయంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ సీపీ వదిలేసిందని ఆయన విమర్శించారు. రాధాకృష్ణపై రెక్కీ నిర్వహించినప్పుడు స్పందించని నాయకులు నేడు పదవులు డబ్బు అంటూ కావాలని రాజకీయ లబ్ధి పొందాలని మాట్లాడుతున్నారని అన్నారు.
అటువంటి వ్యక్తులకు వంగవీటి రంగా అభిమానులు రాధాకృష్ణ అభిమానులు మద్దతు ఇవ్వరని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వంగవీటి రంగా స్మృతి వనాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని, ఏదో ఒక పథకానికి ఆయర పేరుని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రంగా క్రేజ్‌ను వాడుకొనేందుకు ఎగబడుతున్న మూడు పార్టీలు
కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు ఉన్న అభిమానాన్ని, క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అందుకే నిన్న వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు రాధాతో పాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. నేడు వర్థంతి కార్యక్రమంలో వంగవీటి రాధాతో పాటుగా టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.