AP Aqua Farmers: ఆక్వా రైతుల కష్టాలు: ట్రంప్ సుంకాల దెబ్బకు తోడు దళారుల దోపిడీ, తెగుళ్ల బెడద- కుదేలు అవుతున్న పరిశ్రమ!
AP Aqua Farmers:సామాన్య రైతులను కోటీశ్వరులగా మార్చిన ఆక్వా పంట వరుస నష్టాలతో ప్రస్తుతం ఆక్వారైతులను కనుకులేకుండా చేస్తోంది. ఈ కారణం చేతనే రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని చెబుతున్నారు.

AP Aqua Farmers: ఆక్వా పరిశ్రమ వరుస దెబ్బలతో కుదేలవుతోంది.. విదేశీ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం వల్ల డాలర్ల పంటగా ముద్రపడిన ఆక్వా సాగు నుంచి రైతులు క్రమ క్రమంగా బయటకు వెళ్లిపోయే పరిస్థితిలోకి తామున్నామంటున్నారు.. ఆక్వా ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టిన ఆక్వా పరిశ్రమ అధఃపాతాళానికి జారుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఎందుకు వచ్చిందంటే కర్ణుని చావుకు అనేక కారణాలన్నట్లు రైతులు అనేక కారణాలు చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బ ఆక్వా పరిశ్రమను కుదేలు చేయగా రైతులనుంచి దళారుల దోపిడీ, ఆక్వాసాగులో తప్పనిసరి అయినట్టుగా బాధిస్తోన్న తెగుళ్ల బెడద వెరసి మేము ఆక్వా సాగు చేయలేమంటూ చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు..
ఇటీవల విజయవాడలో జరిగిన ఆక్వారైతుల సమస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా పరిశ్రమపై ఓ కీలక సూచన ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో ఉన్న ఆక్వా పరిశ్రమను పదిలక్షల సాగు వరకు విస్తరించాలని సూచించారు. దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.. అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం లేదంటున్నారు ఆక్వా రైతులు..
గోటిచుట్టుపై ట్రంప్ పోటు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆక్వా ఎగుమతులపై విదేశీ సుంకం 25 శాతం భారం పడింది.. ఇది అమలు అయ్యాకే ఈ భారాన్ని మోసామని అనుకుంటే పొరపాటని, అయితే అది అమలు కాకుండానే ఆ మాటను ఆధారంగా చేసుకున్న ఎక్స్‌పోర్టర్లు టన్నుకు రూ.30 వేల నుంచి రూ. 40 వేలు తగ్గించి వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, రైతుల కష్టం రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆక్వా రైతులు వాపోతున్నారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీడ్‌కు సంబందించిన మేత మీద విదేశీ సుంకం పూర్తిగా తొలగించినప్పటికీ టన్నుకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు తగ్గించాల్సి ఉన్నా అది అమలు కాకపోగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అపార నష్టాన్ని చవిచూస్తున్నారంటున్నారు. విద్యుత్తు ట్రాన్ఫార్మర్ల ఏర్పాటు విషయంలో తెలంగాణా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏపీలో అత్యధికంగా 60 శాతం ఎక్కవ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆక్వా చెరువులకు ఎక్కవుగా 100 కేవీఏ, 63 కేవీఏ సామర్ధ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఇది భారీ తేడా కనపడుతుండగా ఈ లోపాన్ని రైతులు ఎత్తి చూపిస్తున్నారు.. మొత్తం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోన్న ఆక్వారంగానికి ఒక్క విద్యుత్తు సరఫరాలో రాయితీ తప్ప మరింకేమీ ఒరిగిందేమీ లేదని ఆక్వా రైతులు పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది..
రాయితీ కరెంటు కనికరం లేకుండా తీసేశారు..
వైసీపీ పాలనలో నాలుగేళ్లపాటు సబ్సిడీ కరెంటుపై ఎటువంటి నిభందనలు అమలు చేయని అప్పటి వైఎస్సార్‌సీపీ అయిదో ఏడాది మాత్రం అనుమతులు లేకుండా సాగు చేస్తున్నవారిపై కొరఢా ఝులిపించింది. వైసీపీ ప్రభుత్వం ఆఖరి ఏడాదిలో ఉన్నఫళంగా రాష్ట్రంలో సుమారు 12 వేల విద్యుత్తు కనెక్షన్లు ఆయా కారణాలను చూపించి తొలగించింది.. గత ప్రభుత్వంలో తొలగించిన విద్యత్తు కనెక్షన్లను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని హామీ కూడా ఇచ్చింది. అయితే నేటికీ రాష్ట్రంలో సుమారు 12 వేల కనెక్షన్లు సబ్సిడీను కోల్పోతున్న పరిస్థితి ఉంది.. దీంతో ఆక్వా సాగులో డీజీల్ కొనుగోలు వల్ల అదనపు బారం పడి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందంటున్నారు..
నాసీరకం సీడ్‌తో నట్టేట ముంచుతోన్న హేచరీలు..
ఆక్వాపరిశ్రమకు ప్రధానమైన సీడ్ విషయంలో కూడా నాసీరకం సీడ్‌ను కొన్ని హేచరీలు రైతులకు అంటగడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీడ్ మేత విషయంలో బ్రూడ్‌స్టాక్‌పైనా, లోకిట్స్, సిష్టులు, తదితర రా మెటీరియల్ ఉత్పత్తులపై కష్టమ్స్ తగ్గించినా సీడ్ ధరల్లో నియంత్రణ లేకపోవడం, నాసీ రకం సీడ్ ఉత్పత్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆక్వా పరిశ్రమ తీవ్రనష్టాల్లోకి వెళుతుందంటున్నారు. ఆక్వా రంగంలో కీలకంగా ఉండే సీడ్, ఫీడ్, భారీ స్థాయిలో ఫామ్ ల్యాండ్స్, ఎక్స్‌పోర్టర్స్ ఇలా అనేక రంగాలను ఒక్కరే నిర్వర్తించడం వీరంతా సిండికేట్‌గా మారడంతో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందన్నారు. వీటిని నియంత్రించే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోతున్నారు..
ఆక్వా సాగుకు దూరమవుతున్న రైతులు
ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే 50 శాతం ఎకరాల్లో రైతులు సాగుకు దూరంగా ఉంటూ ట్యాంకులను ఖాళీగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆక్వా ఎగుమతుల్లో దేశంలోనే 70 శాతం ఉత్పత్పులతో ఏపీ అగ్రస్థానంలో ఉండగా అందులో కూడా ఉభయ గోదావరి జిల్లాల రైతుల ద్వారానే ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. డాలర్ల సంపద దేశానికి, రాష్ట్రానికి తీసుకొస్తున్న ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వరా రైతులే కాకుండా దేశ ఆర్దీక వ్యవస్థ కూడా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అంపశయ్యమీదకు వెళుతున్న ఆక్వా పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే పటిష్టమైన జీవోల ద్వారా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మేతల్లోనూ, మందుల్లోనూ, ఎగుమతుల ప్రక్రియలోనూ సిండికేట్ వ్యవస్థను రూపుమాపితేనే ఆక్వారైతులు బాగుంటారని ఆదిశగా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. ట్రంప్ విధించిన సుంకాల బారి నుంచి ఆక్వారైతులు బయటపడాలంటే ప్రభుత్వం చేయదగ్గ విద్యుత్తు, మేత, మెడిసిన్లలో రాయితీలు వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే ఆక్వా పరిశ్రమ ముందుకు వెళ్తుందని, అప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన లక్ష్యానికి చేరువ కాగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
విద్యుత్తు సబ్సీడీ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలి..
గత ప్రభుత్వంలో తొలగించిన ఆక్వా విద్యుత్తు కనెక్షన్లను కూటమి ప్రభుత్వం తాత్కారం చేయకుండా వెంటనే పునరుద్ధరించాలి. అక్టోబర్ నెల నాటికి సబ్సిడీ వచ్చేలా చొరవచూపడం ద్వారా ఆక్వా రైతులు కొంత వరకు ఉపశమనం పొందుతారు. దేశ సరిహద్ధుల్లో చనిపోతామని తెలిసినా ఎలా దేశ రక్షణ కోసం జవాను ముందుకు వెళతాడో నష్టం తప్పదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వారైతులు ఆక్వారంగంలోనే కొనసాగుతున్నారు.. ఆపదలో ఉన్న ఆక్వా పరిశ్రమ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.- నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు





















