గుడివాడలో పోలీస్ వర్సెస్ టీడీపీ- ఎమ్మెల్సీ విన్నింగ్ సెలబ్రేషన్స్‌తో మరోసారి హైటెన్షన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం గుడివాడలో టెన్షన్ పెట్టింది. సెలబ్రేషన్ చేసుకోవడంపై పోలీసులు ఆంక్షలు విధించడంపై నేతలు మండిపడ్డారు.
కృష్ణా జిల్లా గుడివాడలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు గెలుచుకుందన్న ఆనందంతో ఆ పార్టీ నేతలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనిపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖాకీలు తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం రెండు స్థానాలు కైవశం చేసుకుంది. దీన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాణాసంచ కాల్చి మిఠాయిలు తినిపించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామంటూ ధీమాతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే కృష్ణా జిల్లా గుడివాడలో కూడా సంబరాలకు టీడీపీలు సిద్దమయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు బాణసంచా కాల్చేందుకు యత్నించారు.
టీడీపీ లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటైంలో గుడివాడ పోలీసులు అక్కడకు వచ్చారు. అన్నింటినీ తీసేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా సెలబ్రేషన్స్ ఏంటని ప్రశ్నించారు. ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్‌లో పెట్టుకోండని సూచించారు.
పోలీసులు అలా చెప్పడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎస్సై గౌతమ్ కుమార్ మధ్య తవ్ర వాగ్వాదం నడిచింది.
అసలు ఎందుకు అడ్డుకుంటున్నారని వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తే... నడిరోడ్డుపై సంబరాలేంటని తిరిగి ప్రశ్నించారు ఎస్సై. ఇలా ఇరువురి మధ్య వివాదం నడిచింది. ఇంతలో ఎవరో ఒకరు వెనుక నుంచి టపాసులకు నిప్పు పెట్టారు. తర్వాత వీళ్లిద్దరు ఏం తిట్టుకున్నారో అర్థం కాలేదు.
సీన్ కట్ చేస్తే టీడీపీ లీడర్లు తనను దూషించారని ఎస్సై గౌతమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అసభ్య పదజాలంతో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపిసి సెక్షన్ 353, 341,285,290,506, R/w 34 కింద కేసులు నమోదు చేశారు గుడివాడ వన్ టౌన్ పోలీసులు.