(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada Rains: మోకాలు లోతు నీళ్లలోకి దిగిన మహిళా మంత్రి- ఇంటింటికీ వెళ్లి ఆహారం, పాలు, వాటర్ బాటిళ్ల పంపిణీ
Andhra Pradesh News | ఏపీ మంత్రి సవిత విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 54, 55, 56 డివిజన్లలో మోకాలు లోతు నీళ్లలోకి దిగి ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు.
AP minister Savitha visits floods affected area in Vijayawada | అమరావతి: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించి.. బాధితులకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా మంత్రి సవిత మోకాలు లోతు నీళ్లలోకి దిగి విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షాల కారణంగా ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారని గ్రహించారు. విజయవాడ నగరంలో 54, 55, 56 డివిజన్లలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత పర్యటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో మంత్రులకు నగరంలోని పలు డివిజన్లను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి సవితకు విజయవాడలో మూడు డివిజన్లను అప్పగించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి సవితమ్మ తనకు అప్పగించిన డివిజన్లలో పర్యటించి.. మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ ప్రజలను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ఎవ్వరూ దిగులు చెందవద్దని చెబుతూ వారికి ఆహారం, నీళ్లు, పాలు అందజేస్తున్నారు.
మోకాలులోతు నీటిలో ఇంటింటికీ వెళ్లి పరామర్శ...
మంత్రి సవిత తొలుత 54 డివిజన్ లో పర్యటించారు. ఆహారం పొట్లాలు, పాల కాటన్లు, వాటర్ బాటిళ్లు కేసుల ఎన్ని వచ్చాయని ఆ డివిజన్ ఆఫీసర్ సేదు మాధవన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు అనుకున్న సమయానికి చేరాలని మంత్రి స్పష్టంచేశారు. అనంతరం టీడీపీ నేతలు ఫతుల్లా అహ్మద్ తో కలిసి టీఎస్పీ స్ట్రీట్, గాంధీ బొమ్మ సెంటర్, లక్ష్మయ్య స్ట్రీట్, ఈఫెన్ స్ట్రీట్ లో ఉన్న మోకాలు లోతు నీటిలోకి దిగి ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పాలు, ఆహారం, వాటర్ బాటిళ్లను స్వయంగా మంత్రి పంపిణీ చేశారు. సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి తరలివెళ్లాలని వరద బాధితులకు సూచించారు. ఏమైనా కావాలంటే అడగాలని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.
రోడ్లపై నీరు నిలబడకుండా కాలువల్లో పూడికలు తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని మంత్రి సవిత ఆదేశించారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేయాలని డివిజన్ స్పెషాలాఫీసర్ సేదు మాధవన్ కు సూచించారు. అనంతరం 55 డివిజన్ లో మంత్రి పర్యటించి, అపార్టుమెంట్ల ఉన్నవారితో మైక్ సెట్ లో మాట్లాడారు. పాలు, ఆహారం, నీరు అందాయా..? అని వారిని అడిగారు. అనంతరం ఓల్డ్ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ల పంపిణీకి ఏర్పాటు చేసిన మూడు ట్రాక్టర్లను మంత్రి ప్రారంభించారు. 55 డివిజన్ సీఎస్ఐ సెంటర్లో ముగ్గురు దివ్యాంగులను(అంధులు) గుర్తించిన మంత్రి సవిత వారిని పలకరించారు. వారిని సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి ఆటోలో తరలించాలని మంత్రి ఆదేశించారు.
బుడమేరు బాధితుల్లో భరోసా
బుడమేరు కాలువ వల్ల నీటముగిని 56 డివిజన్ లో ఉన్న పాత రాజరాజశ్వేరి పేట లో ముంపు ప్రాంతాల్లో పవర్ బోటు ద్వారా ఇంటింటికీ వెళ్లారు. నాలుగు గంటలకు పైగా అక్కడ ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లను మంత్రి సవిత స్వయంగా అందజేశారు. సీఎం చంద్రబాబు అన్ని చూసుకుంటారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. సమస్యలు ఉంటే తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: విజయవాడలో అపశ్రుతి, వరదలో కొట్టుకుపోయి లైన్‌మెన్ మృతి - మంత్రి గొట్టిపాటి విచారం