CPI Narayana: సీఎం జగన్ కు కేసుల భయం, ఆయన ఢిల్లీకి వెళ్లేది రాష్ట్రం కోసం కాదు: సీపీఐ నేత నారాయణ
AP News Today: ఏపీలో 440కి పైగా మండలాల్లో కరువు ఉందని, రాష్ట్ర రైతులు కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
AP CM YS Jagan: విజయవాడ: ఏపీలో 440కి పైగా మండలాల్లో కరువు ఉందని, రాష్ట్ర రైతులు కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. కృష్ణా జలాల పున:పంపిణీ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడలో దీక్ష చేస్తున్న రామకృష్ణ వద్దకు వెళ్లి నారాయణ మద్దతు తెలిపారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు.. రామకృష్ణ (CPI Ramakrishna)కు సంఘీభావం తెలిపారు.
అనంతరం సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. నీటి కొరతతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 440కి పైగా కరువు మండలాలు ఉండగా, కరువు ప్రభావం తక్కువగా ఉందనేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి సాధించడంలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలమయ్యారని, స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమర్శించారు. తనపై ఉన్న కేసుల భయంతోనే సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని చెప్పారు.
భారీ మెజార్టీతో ప్రజలు వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో పోరాడతానని చెప్పిన జగన్.. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ప్రజా సమస్యలన పార్లమెంటులో ప్రస్తావించడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ కేంద్రాన్ని మద్దతిస్తున్నారని, జైలుకు వెళ్లకుండా ఉండేందుకే సైలెంట్ గా ఉన్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలుచేశారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేది తన కేసుల మాఫీ కోసమేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదన్నారు.
తక్షణమే కరవు మండలాలు ప్రకటించాలి: దేవినేని ఉమ డిమాండ్
సీఎం జగన్ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని, సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఏపీలో కరవు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 444 మండలాలను కరవు మండలాలుగా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై సీఎం జగన్ పలుమార్లు తేదీలు ప్రకటించారు, కానీ అన్నిసార్లు మాట తప్పిన సీఎంగా నిలిచారంటూ వైసీపీ అధినేతపై సెటైర్లు వేశారు. వ్యవసాయం పట్ల సీఎం జగన్ కు అవగాహన లేకపోవడం రైతుల సమస్యల్ని రెట్టింపు చేసిందని విమర్శించారు. రైతుల సమస్యలు తీరే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.
ఏపీలో తుగ్లక్ పాలన: మాజీ మంత్రి వడ్డే
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. కృష్ణాజలాల్లో మిగులు జలాల్లో ఒక్క టీఎంసీ నీరు మనకు కేటాయించకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్ కేంద్రంతో పోరాటం చేయకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాజీపడ్డారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై వైసీపీకి స్పష్టత లేదని, మరోవైపు కరువు మండలాలు ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ప్రస్తుతం తుగ్లక్ పాలన జరుగుతుందని విమర్శించారు.