Vijayawada: భర్తకు వెన్నుదన్నుగా నిలిచిన భార్య, పత్రికలో కథనానికి స్పందించిన ఉపరాష్ట్రపతి
Vijayawada: విజయవాడలో ఓ కుటుంబం పడుతున్న కష్టాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య స్పందించారు. తన జీతం నుంచి రూ. లక్ష ఆర్థికసాయం చేశారు. కుటుంబానికి అండగా నిలిచిన మహిళ ధైర్యాన్ని వెంకయ్య మెచ్చుకున్నారు.
Vijayawada: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. విజయవాడకు చెందిన ఓ కుటుంబానికి తమ జీతం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. విజయవాడ దినపత్రికలో వచ్చిన వార్త ఆయన్ను కదిలించింది. విజయవాడకు చెందిన చింతా కుమారి, శివప్రసాద్ లు ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రిషియన్ అయిన భర్త సంపాదనతో హాయిగా ఉన్న వారి జీవితంలో ఒక్కసారిగా పెద్ద కష్ట వచ్చింది. శివప్రసాద్ పిట్టగోడ మీద కూర్చుని ఉండగా, ఆ గోడ హఠాత్తుగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముక దెబ్బతింది. భర్త, పిల్లల భారాన్ని మోస్తున్న చింతా కుమారి గురించి వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వార్తను చూసిన ఉపరాష్ట్రపతి వెంటనే వివరాలు కనుక్కోవలసిందిగా సహాయకులను ఆదేశించారు.
ఉపరాష్ట్రపతి ఆర్థిక సాయం
ఆమె వివరాలు తెలుసుకు వెంటనే తన జీతం నుంచి లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని(Donation) అందించాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. భర్తకు అమ్మలా మారి, పిల్లలను చూసుకుంటూ ఆమె నిలబడిన విధానం ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకమంటూ ఆయన అభినందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, కుమారిలా జీవితంలో నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికలో వచ్చిన చిన్న వార్తకు స్పందించి తమకు వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఉపరాష్ట్రపతి(Vice President) ఔదార్యానికి చింతా కుమారి, శివప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అసలేం జరిగింది?
విజయవాడకు చెందిన శివప్రసాద్, చింతా కుమారి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మతాంతర వివాహం కావడంతో ఇరు కుటుంబాలు వీరిని తిరస్కరించాయి. శివప్రసాద్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నెలకు రూ.25 వేల వరకు జీత భత్యాలూ వచ్చేవి. ఇంతలో శివప్రసాద్ కు ప్రమాదం జరిగింది. పిట్టగోడ విరిగి పడిపోవడం వల్ల ఆయన వెన్నెముక దెబ్బతింది. తీవ్రగాయాల పాలైన శివప్రసాద్ కు వెన్నుముక దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ భారం మొత్తం చింతా కుమారిపై పడింది. కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. భర్తకు వైద్యం చేయించేందుకు ఆస్పత్రులకు చుట్టూ తిరుగుతోంది. ఆరేళ్లుగా ఇంటి వద్దే పానీపూరి బండి నడుపుతూ దాంతోనే భర్త ఆసుపత్రి ఖర్చులు, కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
ఒక్కపూట పానిపూరి బండి పెట్టకపోతే ఇంట్లో తినడానికి కూడా ఉండదని కుమారి అంటోంది. రోజుకు వెయ్యి రూపాయల వస్తాయని, అందులో పెట్టుబడికి పోగా రూ. 200-300 మిగులుతాయని అంటున్నారు. ఆ డబ్బుతోనే ఇంటి అద్దెలు, భర్త వైద్యం, పిల్లలకు కావాల్సినవి ఖర్చుచేస్తున్నానన్నారు. తన కోసం అందరినీ వదిలి వచ్చిన భర్తను ఈ పరిస్థితిలో వదిలి వెళ్లలేనన్నారు. ఎవరైనా ఆర్థికసాయం చేస్తే భర్తను మంచి ఆసుపత్రిలో చూపిస్తానని కుమారి అంటున్నారు.