Janasena Janavani : రేపు విజయవాడకు పవన్ కల్యాణ్, జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహణ
Janasena Janavani : జనసేన జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని రేపు(జులై 10) విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
Janasena Janavani : జనవాణి-జనసేన భరోసా రెండో దఫా కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ రెడీ అయ్యారు. ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రెండో విడత కార్యక్రమాన్ని విజయవాడలో పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ హాల్ లో పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, 427 అర్జీలు పవన్ స్వీకరించినట్లు నాదెండ్ల తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నాదెండ్ల చెప్పారు.
వైసీపీ ప్లీనరీ సర్కస్
వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. ప్లీనరీ సమావేశాలను సర్కస్ తో పోల్చారు జనసేన పార్టీ పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుస్తు ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోయిందని ఆయన మండిపడ్డారు. ప్లీనరీ సమావేశాలు పరనిందతో సాగాయన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ సభలు పరాకాష్ట అని విమర్శించారు. అద్భుతంగా ఏర్పాట్లు చేశామని చెప్పి జనాలను తరలించారన్నారు. ఒకరు సింహాలు, మరొకరు పులులు అంటారు, వ్యక్తి గత విమర్శలు ఎప్పుడూ సమాజానికి శ్రేయస్కరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం వింతగా ఉందని నాదెండ్ల అన్నారు.
పబ్లిక్ లోకి వెళ్లేందుకు
జనవాణి-జనసేన భరోసాను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తక్కువ టైంలో పబ్లిక్ లోకి వెళ్లేందుకు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని జనసేన భావిస్తోంది. పవన్ ఎక్కడకు వెళ్లినా జనం వస్తారు. ఆయనను చూడడానికి చాలా మంది వస్తుంటారు. అయితే అసలు సమస్యలు పక్కకు వెళ్లి, బాధితుల సమస్య హైలెట్ కాకుండాపోతుంది. దీంతో బాధితులు పవన్ తో మాట్లాడేందుకు వీలుండటం లేదు. ఇలాంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారందరూ స్వయంగా పవన్ ను కలవచ్చని ఆ పార్టీ భావిస్తుంది. వారి సమస్యలను చెప్పుకోవటం ద్వారా పవన్ కు పార్టీకి కూడా ప్రజలు దగ్గర అయ్యే వీలుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా వినియోగించుకోవటంతో పాటు, ప్రజల్లోకి పార్టీ భావాలు కూడా ప్రచారం అవుతోందని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు విజయవాడలోనే రెండో దఫా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇకపై జిల్లా స్థాయితో పాటుగా ప్రధాన పట్టణాల్లో కూడా కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధం అవుతున్నారు.