Ayesha Meera Case: సీజేఐకు ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ... 14 ఏళ్లుగా న్యాయం దక్కడంలేదని ఆవేదన
ఆయేషా తల్లిదండ్రులు సీజేఐకు లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తు్న్నామని, ప్రజాస్వామ్య దేశంలో న్యాయ దక్కడంలేదని ఆవేదన చెందారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయేషా మీరా తల్లిదండ్రులు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో తమకు 14 సంవత్సరాలుగా న్యాయం దక్కడంలేదని ఆవేదన చెందారు. తమ కూతురు అయేషా మీరాను హాస్టల్ లో అత్యాచారం చేసి, దారుణంగా చంపేసి 14 సంవత్సరాలు అయినా దోషులను పట్టుకోలేదన్నారు. హాస్టల్ నిర్వహకులు, పోలీసులు కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేసేశారని ఆరోపించారు. ఈ కేసులో అసలు హంతకులు ఎవరో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. దోషులు చట్టానికి దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నారన్నారు. న్యాయం కోసం 14 సంవత్సరాలుగా అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. విచారణ సంస్థల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోయినా హక్కుల కోసం నిబద్ధతతో పోరాడుతున్నామని ఆయేషా మీరా తల్లిదండ్రులు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ద్వారా న్యాయం చేయమని అడగటం లేదని, బాధితులు భయపడకుండా, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా నిలబడితే ఎన్ని సంవత్సరాలకైనా దేశంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో లేఖ రాశామని తెలిపారు.
సీజేఐకు ఆయేషా తల్లిదండ్రుల లేఖ
'డిసెంబర్ 27, 2007 అర్ధరాత్రి విజయవాడలో 19 సంవత్సరాల బి.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా అత్యాచారం, హత్య సంచలనం రేపింది. 2012 డిసెంబర్ 16వ తేదీన దిల్లీలో అర్ధరాత్రి బస్సులో జరిగిన నిర్భయ సంఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. 2019 హైదరాబాద్ లో అర్ధరాత్రి హైదరాబాద్ హైవే మీద జరిగిన దిశ సంఘటన దిగ్ర్భాంతికి గురిచేసింది. నిర్భయ సంఘటన పార్లమెంటులో ఆడ పిల్లలపై లైంగిక దాడులకు, అత్యాచారాల నివారణకు చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటుచేసింది. జస్టిస్ వర్మ కమిటీ ఒక సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వం ముందు ఉంచింది. నిర్భయ హంతకులపై జిల్లా కోర్టు సమగ్ర కేసు విచారణ సమగ్రంగా త్వరిత గతిన చేసి, ఉరి శిక్ష విధించింది. పై కోర్టులు కూడా మరణ శిక్షను సమర్ధించాయి. దిశ హంతకులను కాల్చి చంపామని రాష్ట్రంలో సత్వర న్యాయం చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంది. పార్లమెంటులో చాలా మంది సభ్యులు ఆవేశంగా ఎన్ కౌంటర్ చేయడమే ఆడవాళ్లపై అత్యాచారాలు నివారించడానికి పరిష్కారం అని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించి దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసింది. 21 రోజులలో న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేటట్లు చట్టంలో పొందు పరిచామని చెప్పారు.' ఆయేషా మీరా తల్లిదండ్రులు సీజేకి లేఖ రాశారు.
Also Read: బెజవాడలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.... మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ
మూగజీవాలుగా మిగిలిపోతాము
'దిశకు ఏదో విధంగా న్యాయం జరిగితే ఆయేషాకు ఎందుకు న్యాయం జరగడం లేదు. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా మీడియా ఈ కేసులో జరుగుతున్న లోటుపాట్లు, దర్యాప్తు సంస్థల వైఫల్యాలు, కోర్టు తీర్పులపై నిరంతరం చర్చ పెడితే 'ఆయేషా'ను సజీవంగానే ఉంచారు. కానీ అసలు హంతకులు కూడా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. జరిగిన సంఘటనకు పరిహారం ఇస్తామని అసెంబ్లీలో అన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన వారిని కాపాడటానికి పోలీసు యంత్రాంగం అమాయకులను కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాము. చివరగా పేద దళిత కుటుంబానికి చెందిన సత్యంబాబుపై కేసు బనాయిస్తే, కోర్టులో హంతకుల పేర్లు చెప్పి సత్యంబాబును నిర్దోషి అని చెప్పాం. న్యాయస్థానం అదే ధ్రువీకరించినది, ఈ మధ్య ప్రధాన న్యాయమూర్తిగా దేశంలో అనేక కేసులలో సీబీఐ దర్యాప్తు నత్తనడకన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తే దానిని సమాధానపరచుకోవడానికి హడావిడిగా కోర్టులో హాస్టల్ వార్డెన్ కు, తోటి విద్యార్థినులకు నార్కో ఎనాల్సిస్ పరీక్షలు జరిపి వాళ్లు నోరు విప్పితేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పి పిటిషన్ వేశారు. యథాతధంగా కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. సీబీఐ విచారణతో ముగిసిన కథ మళ్ళీ మొదలుకొచ్చింది.మేము చివరగా కోరుకొనేది ఈ వ్యవస్థలో మీకు న్యాయం జరుగదు అని ఆమోద ముద్ర వేస్తే న్యాయం కోసం పిచ్చి వాళ్లుగా ఎదురు చూడకుండా మూగజీవాలుగా మిగిలిపోతాము' అని ఆయేషా తల్లిదండ్రులు లేఖలో తెలిపారు.
Also Read: ఆశలు వమ్ము చేయను.. తెలుగువాడిగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తా - జస్టిస్ ఎన్వీ రమణ