Tarakratna Vijayasai : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది - బాలకృష్ణకు ధ్యాంక్స్ చెప్పిన విజయసాయిరెడ్డి !
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న వైద్యం విషయంలో బాలకృష్ణ చూపిన చొరవకు ధ్యాంక్స్ చెప్పారు.
Tarakratna Vijayasai : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శిచారు. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో .. వైద్యులతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి .. విజయసాయిరెడ్డి సోదరి కుమార్తె. ఈ కారణంగా తారకరత్న బంధువులు అవుతారు. అందుకే ఆయన పరామర్శకు వచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందిని ఆస్పత్రి సిబ్బంది మంచి వైద్య సేవలందిస్తోందని అన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో నలభై ఐదు నిమిషాల సేపు మెదడకు రక్తం అందకపోవడం వల్ల బ్రెయిన్ కు సమస్య వచ్చందన్నారు. బ్రెయిన్ పై భాగంలో వాపు రావడం వల్ల కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. గుండెతోపాటు ఇతర అవయవాలు బాగున్నాయి మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతోందని విజయసాయిరెడ్డి తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు. వైద్య సేవలను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని .. బాలకృష్ణకు ధ్యాంక్స్ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
మరో వైపు తారకరత్నకు వైద్యులు అత్యున్నత స్థాయి వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. మరోసారి బ్రెయిన్ కు సంబంధించిన పూర్తి పరీక్షలు చేసిన తర్వాత హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశం ఉంది. బ్రెయిన్ సమస్య కావడంతో తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం గుండెతో పాటు ఇతర అవయవాలు అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయనివిజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఇంకా ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ పాదాయాత్ర ప్రారంభ కార్యక్రమానికి కుప్పం వెళ్లిన తారకరత్న పాదయాత్రలో 27వ తేదీన కుప్పకూలిపోయారు. తీవ్ర గుండెపోటు వచ్చినట్లుగా అప్పట్లో నిర్ధారించారు. మొదట స్థానిక ఆస్పత్రిలో ఆ తర్వాత కుప్పం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరించారు. అప్పట్నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోంది.
తారకరత్నను నందమూరి కుటుంబసభ్యులంతా పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న ను పరామర్శించేందుకు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు.. ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా తారకరత్న కు అవసరమైన వైద్య సాయంలో ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం కావాలన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి తారకరత్నకు అందుతున్న చికిత్సపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ అంశంపై ఆయనకు నందమూరి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
తారకరత్న ఎక్మోపై ఉన్నారని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. ఎక్మోపై అంటే అత్యంత క్రిటికల్ స్టేజ్ అని కోలుకోవడం కష్టమని సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి. అయితే అసలు తారకత్నకు ఎక్మో చికిత్స చేయలేదని.. వెంటిలేటర్ పై మాత్రమే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఎక్మోపై చికిత్స అంటే కోలుకోవడం కష్టమన్న భావన ఉండేది. కానీ ఎక్మో అవసరం లేదని తేలడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.