TTD Deputy EO Lokanatham Arrest: కల్తీ నెయ్యి కేసులో సీబీఐకి దొరికిన ఆధారాలు - టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అవినీతిలో సంచలన విషయాలు
ACB Raids Tirupati: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను అరెస్ట్ చేసిన ఏసీబీ. 2 కిలోల బంగారం, రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

Tirumala Deputy EO Lokanatham: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అవినీతి నెట్‌వర్క్‌పై అవినీతి నిరోధక శాఖ ఉక్కుపాదం మోపింది. తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు, విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లోని ఆయన ఇల్లు, తిరుమలలోని ఛాంబర్‌తో పాటు ఐదు కీలక ప్రాంతాల్లో సాగిన తనిఖీల తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంపై సీబీఐ జరిపిన దర్యాప్తులో లభించిన కీలక ఆధారాల ఆధారంగా ఏసీబీ ఈ కేసు నమోదు చేసి దాడుల నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలతో ఏసీబీ జరిపిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రాథమికంగా దాదాపు రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. తిరుపతిలోని పీకే లేఅవుట్లో భార్య పేరిట కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనంతో పాటు, గొల్లవానిగుంటలో భార్య పేరుపైనే రెండు ప్లాట్లు, మరో భవనం ఉన్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, వడమాలపేట మండలం పడిరేడు అరణ్యం గ్రామంలో ఇంటి స్థలం, తిరుపతి శ్రీనివాస నగర్లో కుమారుడి పేరు మీద విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఏసీబీ రికార్డుల్లో తేలింది.
కేవలం స్థిరాస్తులే కాకుండా పెద్ద మొత్తంలో పసిడి, వెండి, నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ జరిపిన సోదాల్లో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండితో పాటు రూ. 12.5 లక్షల నగదును దొరికాయి. లోకనాథం తన కుమారుడు , ఇతర బంధువుల పేర్లపై దాదాపు నాలుగు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి రూ. 31.98 లక్షల విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన లోకనాథం, వరుస పదోన్నతులతో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అత్యంత కీలక స్థానాల్లో పనిచేసిన ఈయనపై, టీటీడీ చైర్మన్ మాజీ పీఏ చిన్న అప్పన్న కేసుకు ముడిపడి ఉన్న ఆధారాల వెలుగులోనే ఈ దాడులు జరిగాయి. సీబీఐ చేసిన దర్యాప్తులో దొరికిన ఆధారాలతోనే ఈ సోదాలు జరిగాయి. దశాబ్దాల కాలంలో తిరుమలలో ఇంతటి భారీ స్థాయిలో ఉన్నతాధికారిపై ఏసీబీ విరుచుకుపడటం దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో, టీటీడీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
అరెస్ట్ చేసిన లోకనాథంను తిరుపతి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు, ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అక్రమాస్తుల వెనుక ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు లేదా ఇతర అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. బెంగళూరు, ఏర్పేడు తదితర ప్రాంతాల్లో ఉన్న ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు ఇంకా కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని అక్రమాస్తుల లెక్కలు బయటపడే అవకాశముంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















