Chittoor Bandh: చంద్రబాబు పర్యటనలో విధ్వంసం- నేడు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపు
YSRCP calls Bandh for Chittoor District: పుంగనూరులో శుక్రవారం చంద్రబాబు విధ్వంసం సృష్టించారని, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ నేడు చిత్తూరు జిల్లా బందుకు వైసీపీ పిలుపునిచ్చింది.
YSRCP calls Bandh for Chittoor District: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పుంగనూరులో పర్యటించారు. అయితే చంద్రబాబు పర్యటనలో టీడీపీ, అధికార వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. పోలీసులపై, పోలీస్ వాహనాలపై సైతం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది వరకు పోలీసులు సైతం గాయపడ్డారు. అయితే పుంగనూరులో శుక్రవారం చంద్రబాబు విధ్వంసం సృష్టించారని, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ.. నేడు (ఆగస్టు 5న) చిత్తూరు జిల్లా బందు కు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేఆర్‌జే భరత్ కోరారు.
పుంగనూరులో విధ్వంసంపై సజ్జల సీరియస్
అంగళ్లు, పుంగనూరులలో శుక్రవారం జరిగిన చంద్రబాబు రోడ్ షో ఉద్రిక్తతలకు దారితీయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్బంగా జరిగిన దాడులు, విధ్వంసంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణితో ఉన్నాడన్నారు. చంద్రబాబు పిచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని, నేడు జరిగిన విధ్వంసం వెనుక ఉన్నది టీడీపీ నేతలేనని ఆరోపించారు. మొన్న పులివెందులలో ఇదే ధోరణితో చంద్రబాబు ఉన్నాడని, ఈరోజు సైతం వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపి వాహనంలో తుపాకీ ఎలా దొరికింది, ఏం చేద్దామని తుపాకీ తీసుకొచ్చారని ప్రశ్నించారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని, అంగళ్లు ఘటనలో యాక్షన్, రియాక్షన్ రెండూ నాయకత్వంలోనే జరిగాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరి మంచిది కాదు అని, పోలీస్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
పుంగనూరులో ప్రీప్లాన్డ్ దాడులు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ
పుంగనూరులో జరిగిన రాళ్ల దాడుల ఘటనల్లో ఇరవై మంది పోలీసులు గాయపడ్డారని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డీఎస్పీ కూడా గాయపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.
తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అంగళ్లు గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడానికే ఇలా వైసీపీ కార్యకర్తలు రోడ్డును బ్లాక్ చేశారన్నారు. ఇలా చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. తెలిపారు. అంగళ్లు గ్రామానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.