Tirumala News: టీటీడీ కొత్త ఈవో కీలక నిర్ణయం - ఇక అవన్నీ అందరికీ కనిపించేలా ఏర్పాట్లు
TTD News: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు దాదాపు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నారు.
Tirumala Latest News: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త కార్యనిర్వహణాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జే శ్యామలరావు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఆదేశించారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలను టీటీడీ వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పారదర్శకంగా భక్తులు ముందు ఉంచాలని ఈవో నిర్ణయించారు.
ఒక్కరోజే భారీగా పదవీ విరమణ
టీటీడీలో ఒకే రోజు పెద్ద ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ జరుగుతోంది. జూన్ 30 ఒక్కరోజే దాదాపు 113 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వీరిలో ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఉన్నారు. దీంతో 5 డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. మరోవైపు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే వివాదం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రమోషన్లను టీటీడీ అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టారు.
దర్శనానికి 18 గంటలు
మరోవైపు, తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు దాదాపు 18 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు దాదాపు అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. జూన్ 28న స్వామివారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. వారిలో 35,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం ఒక్కరోజే రూ.3.83 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
- జూలై 2న మతత్రయ ఏకాదశి.
- జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం.
- జూలై 15న పెరియాళ్వార్ శాత్తుమొర.
- జూలై 16న శ్రీవారి ఆణివార ఆస్థానం.
- జూలై 17న తొలి ఏకాదశి.
- జూలై 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ.
- జూలై 22న శ్రీ విఖనస మహాముని శాత్తుమొర.
- జూలై 31న సర్వ ఏకాదశి.