Tirumala News: త్వరలో తెలంగాణకు మంచి రోజులు - తిరుమలలో రేవంత్ రెడ్డి, శ్రీవారి దర్శనం
Tirumala News: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర, తెలంగాణ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర ప్రార్థించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy in Tirumala: తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబరు 12) ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆలయ వెలుపలుకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర, తెలంగాణలో మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర ప్రార్థించినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేశారు.