Tirupati Accident: శ్రీవారిని దర్శించుకుని వెళ్తుంటే ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు మృతి
Tirupati Accident: తిరుపతి జిల్లా కాశిపెంట్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృతిచెందారు. మృతులను కర్ణాటకు చెందిన వారిగా గుర్తించారు.
Tirupati Accident: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ కు చెందిన గోపినాథ్, శ్యామల దంపతులు తిరుమల శ్రీవారి దర్శనాంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. చంద్రగిరి మండలం, కాశిపెంట్ల జాతీయ రహదారి పైకి చేరుకోగానే కారు అదుపు తప్పింది. సోలార్ స్తంభాన్ని ఢీకొని పల్టీలు కొడుతూ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. పోలీసు అధికారులు ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. రహదారిపై వేగంగా వస్తున్నప్పుడు టైర్ పంక్చర్ కావడంతో కారు అదుపుతప్పి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏలూరులో ఆటోపై విరిగిపడ్డ తాటిచెట్టు, చిన్నారి మృతి
ఏలూరు జిల్లాలో పండుగ పూటే విషాదం చోటు చేసుకుంది. మహాలక్ష్మిలా బుడిబుడి అడుగులు వేస్తూ అల్లరి చేయాల్సిన పాప అనంత వాయువుల్లో కలిసిపోయింది. తల్లితో కలిసి ఆటోలో వెళ్తుండగా.. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ తాటిచెట్టు విరిగిపోయి ఆటో మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే చనిపోగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఐదుగురు మహిళలు ఉన్నారు.
నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం నుంచో ఓ ఆటో వెళ్తుంది. అయితే ఆ ఆటోలో ఐదుగురు మహిళలతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో.. తాటి చెట్టు విరిగి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వచ్చి చెట్టును పక్కకి జరిపి.. ఆటోలో ఉన్న వాళ్లను బయటకు తీశారు. ఈ క్రమంలోనే రెండేళ్ల వయసు ఉన్న చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు భార్య పనిచేసే బస్సు కింద పడి భర్త మృతి
ఆమె ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగి. రోజూ ఆమెను బైక్ పై బస్ డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి తీసుకెళ్తాడు. రోజూలాగే ఈరోజు కూడా భార్యని బైక్ పై గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. ఆమెను లోపలికి పంపించి బైక్ పై బయటకు వచ్చాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. చక్రాలకింద నలిగిపోయి భర్త ప్రాణాలు వదిలాడు. భర్త శవంపై పడి భార్య రోదిస్తున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.