Tirumala Tirupati Heavy Rush: తిరుమలకు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? సెప్టెంబర్ 13న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - దర్శనానికి 24 గంటల సమయం
TTD VIP Break Darshan cancelled: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో సెప్టెంబర్ 13న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Srivari Sarvadarshanam wait time 24 hours: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు, వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వరుసగా వారాంతపు సెలవులు రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ రద్దీని క్రమబద్ధీకరించడం , సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శన వేళలను కుదించి, ఆ సమయాన్ని సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం నాడు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయటంతో, అంతకుముందు రోజైన సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసింది. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే చట్టబద్ధమైన మినహాయింపులు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు వినియోగిస్తామని టీటీడీ వెల్లడించింది. కొండపైకి వచ్చే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందేలా సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
తిరుమలకు ప్రయాణమయ్యే భక్తులు ఈ మార్పులను గమనించి, తమ తిరుమల యాత్రను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు. స్వామివారి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరూ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించి, సురక్షితమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని దేవస్థానం కోరింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే కానుకల రూపంలో రికార్డు స్థాయిలో నిత్య హుండీ ఆదాయం సమకూరింది. కొండపై భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా ఏకంగా *రూ. 6.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఒకే రోజు హుండీ వసూళ్లలో ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది. వరుస సెలవులు, ఆన్‌లైన్ దర్శన టోకెన్ల కోటా పూర్తి కావడం, స్వామివారిని దర్శించుకునేందుకు కిక్కిరిసిన సర్వదర్శనం క్యూలైన్ల వల్ల భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారికి కానుకలు, మొక్కుబడులను హుండీలో సమర్పించుకోవడంతో ఈ స్థాయిలో ఆదాయం లభించింది.
ట్రెండింగ్ వార్తలు






















