(Source: ECI/ABP News/ABP Majha)
Madakasira Politics: టీడీపీ నేత ఇంటి ముందు అదేపార్టీ నేత ఆత్మహత్యాయత్నం - తీవ్ర ఉద్రిక్తతలు!
Madakasira Politics: ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయిన కార్యకర్తను పక్కనే ఉన్న పార్టీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
MLC Gundumala Thippeswamy: మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటి ముందు టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. గుండుమల తిప్పేస్వామి వర్గానికే టీడీపీ టికెట్ కేటాయించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్రిక్తతకి దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయిన కార్యకర్త చంద్రశేఖర్ అని గుర్తించి.. పక్కనే ఉన్న పార్టీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మడకశిర నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్ కు కేటాయించడంపై మడకశిర టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చినందుకు నిరసనగా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నివాసం నుండి వందల మంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ తప్పించి వేరే ఎవరికైనా ఇస్తేనే పనిచేస్తామని లేకపోతే పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని కార్యకర్తలు తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా మడకశిర నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కి మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గం లో ఎవరికీ వారే అన్నట్టు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో గుండుమల తిప్పేస్వామి ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది. అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కూడా మంచి పట్టు ఉంది. ఈ ఇద్దరి మధ్య వర్గ విభేదాలతో ఈరన్న కొడుకు డాక్టర్ సునీల్ కు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడంతో గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గుండుమల తిప్పేస్వామి వర్గానికి టికెట్ ఇస్తే నియోజకవర్గం లో అభ్యర్థిని గెలిపించుకొని వస్తామని గతంలో కూడా చంద్రబాబు ముందు మడకశిర పంచాయతీ జరిగింది. చంద్రబాబు ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకే టికెట్ కేటాయించారు. దీంతో గుండుమల తిప్పేస్వామి వర్గం టికెట్ ప్రకటించిన వారం రోజుల తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నియోజకవర్గలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్గ విభేదాలకు త్వరగతిన పరిష్కారం చూపకపోతే రానున్న ఎన్నికల్లో ఈ వర్గ విభేదాలతో పార్టీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది.