Chandragiri Fake Votes : చంద్రగిరిలో 18 వేల ఓట్ల గల్లంతు - ఆధారాలతో ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన టీడీపీ ఇంచార్జ్ !
చంద్రగిరిలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని టీడీపీ నేత పులివర్తి నాని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఇదంతా చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు.
Chandragiri Fake Votes : చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడమే కాకుండా దొంగ ఓట్లను చేర్చారని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పులివర్తి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బోగస్ ఓట్లపై తిరుపతి ఆర్డీఓను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ దొంగ ఓటర్ల ప్రక్రియ ప్రారంభించారని.. స్వయంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కార్యాలయంలో దొంగ ఓటర్లను నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో ఎవ్వరిని బయటకు రానివ్వకుండా ఎమ్మెల్యే పిఆర్వో భాస్కర్ నాయుడు ఈ తతంగాన్ని నడిపించారని.. భాస్కర్ నాయుడు పై ఎసిబి కేసులు ఉన్నా పిఆర్వో గా నియమించుకుని కుట్రలు పన్నారని పులివర్తి నాని ఆరోపించారు.
బిసి, ఎస్సీల ఓటర్లు అత్యధికం ఉన్న పోలింగ్ బూత్‌లను గందరగోళం చేశారన్నారు. మా సొంత ఊరిలో ఉన్న బూతును తీసుకెళ్లి 4కిలోమీటర్ల అవతల ఉన్న వడ్డేపల్లిలో కలిపేశారని .. అలా నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నా బూతులన్నింటిని మార్చేశారని ఆరోపించారు. డోర్ నెంబర్ లేని ఇళ్లలో భారీగా దొంగ ఓట్లు చేర్చారు .. ఓటరు నెంబర్ ఒకటే ఉన్నా ఇంటి పేర్లు, తండ్రి పేర్లు మార్చి తిరుపతి ఓటర్లను చంద్రగిరిలో భారీగా చేర్చారని ఆరోపించారు. ఇలాంటి ఓట్లు 9వేలు ఆధారాల పాటుతో దొరికాయన్నారు.
ఎమ్మార్వో కార్యాలయంలోని కంప్యూటర్ కు ఉన్న పాస్వర్డ్ తో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓట్లు తొలగించారని టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు బూత్ నెం. 116లో 1160ఓట్లు ఉంటే టిడిపి సానుభూతి పరులైన 335మంది ఓట్లు తొలగించారని తెలిపారు. అగరాల పంచాయితీలో 832ఓట్లు ఉంటే 312 ఓట్లు డిలీట్ చేశారని తెలిపారు. ఏజీ పల్లెలో బూత్ నెం 122లో 873 ఓట్లు ఉంటే 591 టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేశారని ఆర్జీవోకు వివరించారు. చివరకు రామిరెడ్డిపల్లిలో వైసీపీ అసమ్మతి నేత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తీసేశారని మండిపడ్డారు.
ఇలా 85శాతం టిడిపి సానుభూతి పరులు ఓట్లు గల్లంతు చేశారు.. మొత్తం 18వేల మంది ఓట్లు తొలగిస్తే అందులో 15వేల ఓట్లు టిడిపి సానుభూతి పరులవే ఉన్నాయన్నారు. ఇక డబుల్, త్రిబుల్ ఎంట్రీ ఓట్లు 9 నుంచి 15వేలు ఉన్నాయి. ఓటరు లిస్టులో పేరు తొలగిస్తే ప్రజలను చంపినట్లే కాదా..? ఇది న్యాయమేనా..? అని ప్రశ్నించారు. ప్రజలను చంపి గెలవాలనుకుంటే నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏవిధంగా చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని.. ఓటర్ జాబితా అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేసే వరకు పోరాడుతానని ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్, ఆర్డీవో ఫిర్యాదు చేశానని.. స్పందించకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దొంగ ఓట్లతో గందరగోళం సృష్టించినా చంద్రగిరి కోటపై టిడిపి జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.