Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమర రాజా బ్యాటరీస్ యాజమాన్యంపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై చర్యలపై స్టే
సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమర రాజా బ్యాటరీస్ యాజమాన్యంపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమర రాజా బ్యాటరీస్ కంపెనీకి కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) ఫిబ్రవరిలో జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్టే విధించింది.
కాలుష్య నియంత్రణ మండలి నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని ఏపీ హైకోర్టు ఇదివరకే ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సాయంత్రం విచారణ జరిగింది. అమర్ రాజా బ్యాటరీస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సైతం సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ కొనసాగించనుందని కోర్టు పేర్కొంది.
చిత్తూరు జిల్లా కరకంబాడిలో అమర రాజా బ్యాటరీస్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో భూములు కేటాయించింది. అయితే పనులు మొదలుకాలేదని, ఈ భూముల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సంస్థకు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా.. భూములపై స్టేటస్ కో(యథాతథస్ధితి) కొనసాగించాలని హైకోర్టు కొన్ని నెలల కిందట ఆదేశాలు ఇచ్చింది.
గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కొత్త యూనిట్లను ప్రారంభించడంలో జాప్యం చేయడం, మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి కొన్ని నిబంధనలు పాటించలేదని నోటీసులు జారీ చేసింది. భూముల కేటాయింపు, పీసీబీ నోటీసులపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. తమకు సరైన రిపోర్ట్ అందించలేదని అటు అమరరాజా యాజమాన్యంపై, ఇటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో తదుపరి చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.