Roja on Chandrababu: చంద్రబాబు రాయలసీమ ద్రోహి, ఆయనకు ఆల్జీమర్స్ - రోజా సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలోని ఎన్.సీ.సీ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు మంత్రి రోజా సత్కరించి బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
Minister RK Roja: రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు నిలిచి పోయారని ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని ఎన్.సీ.సీ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు మంత్రి రోజా సత్కరించి బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చాడా అని ఆమె ప్రశ్నించారు. తాగునీటి ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆమె విమర్శించారు.
రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు, కనీసం చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్టును తీసుకుని రాలేదని అన్నారు. ఏపీలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో ఒకటైన పూర్తి చేసింది చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోలవరాన్ని 2018 లోనే పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో డయాఫ్రం వాల్ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు డబ్బులు కోసం పోలవరాన్ని ఒక ఏటీఎంలో వాడుకున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ విమర్శించారని గుర్తు చేశారు.
పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్ఆర్ అయితే పూర్తి చేసేది మాత్రం జగనన్నే అని చెప్పారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను తన ఐదేళ్ల పరిపాలనలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఏపీ ప్రజలకు చంద్రబాబు చెప్పాలని అన్నారు. తండ్రి స్ఫూర్తితో జలయజ్ఞం ప్రాజెక్టులన్ని పూర్తి చేయబోయేది జగన్ ఒక్కరిని, రాయలసీమకు గుండెకాయ అయినా గండికోట లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు ఇవ్వబోతుంది జగన్ అన్నారు. అదే విధంగా నెల్లూరులో సోమశీలా ప్రాజెక్టును పూర్తి చేసి హంద్రీనీవా ప్రాజెక్టుకు సామర్థ్యాన్ని పెంచేది కూడా జగన్ ఒక్కరిని అన్నారు.
ఇక వ్యవసాయం దండగ అని నిర్మాణ పనుల్లో ఉన్న ప్రాజెక్టులు అన్నిటిని నిలిపివేసిన ఘనత చంద్రబాబుది ఐతే, కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి సకాలంలో ప్రజలకు సాగునీరు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు జగనన్న పరిపాలన గమనిస్తున్నారు కాబట్టి 2024లో రాష్ట్రంలో అయినా రాయలసీమలో అయిన 175 కి 175 సీట్లు వైసిపి ప్రభుత్వం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకి ఆల్జీమర్స్ వచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు రాలేదు కనుక జగనన్న మీద ఎన్ని ఆరోపణలు చేసి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడుని ఆదరిస్తే ఆయన వారినే మోసగించాడని విమర్శించారు. కుప్పం ప్రజలకు హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకువస్తానని మాయ మాటలు చంద్రబాబు చెప్పాడని, కానీ ప్రాజెక్టును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.