(Source: ECI/ABP News/ABP Majha)
TTD News: తిరుమలలో శునకంతో కర్ణాటక భక్తులు చక్కర్లు - టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఫైర్!
TTD News: తిరుమలలో కర్ణాటక భక్తులు శునకంతో వచ్చి హల్ చల్ చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TTD News: తిరుమలలో శునకం హల్ చల్ చేసింది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకి వచ్చిన కర్ణాటక భక్తులతో పాటు వాహనంలో వారి పెంపుడు కుక్కని తిరుమలకి తీసుకొని రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్ట బయలు అయింది. తిరుమలలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శునకాలని కొండ పైకి టీటీడీ నిషేధించింది. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో కూడా శునకాలని పెంచడాన్ని కూడా టీటీడీ నిషేధించింది. అయితే కర్ణాటకకి చెందిన భక్తులు వారి టెంపో వాహనంలో కుక్కని తీసుకొచ్చినా.. భద్రతా సిబ్బంది పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. భక్తులు కుక్కని వారి వాహనంలోనే పెట్టుకొని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందిపై భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం పెరిగిన నేపథ్యంలో శునకం కోసం చిరుత జనవాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలిపిరి తనిఖీ సమయంలో.. టిటిడి సిబ్బంది గుర్తించి ముందస్తుగానే అనుమతిని నిరాకరించాలని భక్తులు కోరుతున్నారు.
ఇటీవలే ఆనంద నిలయం ఫొటోలు, వీడియోలు తీసిన అధికారులు
తిరుమలలో సంచలనం రేపిన ఆనంద నిలయం ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిని టీటీడీ అధికారులు పట్టుకున్నారు. రాహుల్ రెడ్డి అన్నే భక్తుడు ఆనంద నిలయం వీడియో చిత్రికరించినట్లు టీటీడీ ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. రాహుల్ ఉద్దేశ పూర్వకంగానే వీడియో చిత్రికరణ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారని ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామన్నారు. ఈ క్రమంలోనే సీవీఎస్వో, వీజీవోతో పాటు భద్రత అధికారులను మందలించామన్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో పవర్ కట్ అయ్యే పరిస్థితి లేదని.. తిరుమల చరిత్రలో రెండు గంటల పాటు కరెంటు పొయిన పరిస్థితి లేదన్నారు. టీటీడీ తరుపున ఇలాంటి ప్రకటన ఎలా ఇచ్చారో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చారు. శ్రీవారి ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పొయ్యే పరిస్థితి లేదన్నారు.
లడ్డు నాణ్యతను మరింత పెంచుతాం..!
కాషన్ డిపాజిట్ రీఫండ్ కావడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆలయ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వెను వెంటనే భక్తులకి కాషన్ డిపాజిట్ అందే విదంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారిశుద్ద కార్మికులు సమ్మెకీ వెళ్లడంతో తిరుమలలో పారిశుద్ధ్య పనుల్లో కొంత లోపాలు కనిపిస్తున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసిన తర్వాత తిరుమలని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్ననారు. అన్నదానంలో బియ్యం, లడ్డు నాణ్యత లోపించిందంటూ భక్తులు ఫిర్యాదు చేశారని అన్నారు. నాణ్యమైన బియ్యానే టీటీడీ వినియోగిస్తుందని.. లడ్డు నాణ్యతని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. రెండు ఘాట్ రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో ఉద్యోగుల నేతృత్వంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామని అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial