Janasena కిరణ్ రాయల్ అరెస్టు అప్రజాస్వామికం, మంత్రి రోజా ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు: నాదెండ్ల మనోహర్
జనసేన నేత కిరణ్ రాయల్ ను అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం అన్నారు నాదెండ్ల మనోహర్. ఏ కేసు పెట్టారో చెప్పకుండా, కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారన్నారు.
రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్‌ను అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ ను అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం అన్నారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఏ కేసు పెట్టారో చెప్పకుండా, కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా అందర్నీ భయబ్రాంతులకు గురి చేసేలా ఇంటి తలుపులకు తాళాలు వేసి మరీ కిరణ్ రాయల్ ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం దురదృష్టకరం అన్నారు. నగరి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని మంత్రి రోజాకు తమ పార్టీ నేత కిరణ్ రాయల్ సవాల్ చేయడంతో... అప్పటి నుంచి కక్షగట్టిన మంత్రి జనసేన నాయకులు, వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం అన్నారు. కిరణ్ రాయల్ అక్రమ అరెస్టును తిరుపతి జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని స్థానిక జనసేన నేతలు నిరసన చేపట్టారు.
మంత్రి రోజా ఏ విధంగా మాట్లాడతారో అందరికీ తెలుసు
‘జనసేన పార్టీ తరఫున పోలీస్ శాఖను ఒకటే కోరుతున్నాం. వైసీపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో.. వాళ్లు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సరైంది కాదు. ముందుగా నోటీసులు ఇవ్వండి న్యాయపరంగా మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తాం. అవసరమైతే మా నాయకులే పోలీసులకు తగిన విధంగా సహకరిస్తారు. అంతేతప్ప మంత్రి చెప్పారని ఇష్టానుసారంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మంత్రి రోజా బహిరంగంగా ఎలా మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ అరెస్టు అంశం మీద చర్చించారు. జన సైనికులంతా కిరణ్ రాయల్ కుటుంబానికి అండగా నిలబడతాలని సూచించారు. ప్రజల సమస్యలపై, స్థానికంగా జరగాల్సిన డెవలప్‌మెంట్ పై, ప్రభుత్వ అవినీతిపై ఆయన పలుమార్లు ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కిరణ్ రాయల్. రాజకీయ కక్ష సాధింపులో ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో వైసీపీ నాయకుల దాష్టీకాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. ప్రజా ప్రస్థానంలో జనసేన పార్టీని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని’ నాదెండ్ల మనోహర్ అన్నారు.,
Kiran Royal Arrest : తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరు పోలీసులు అంటూ వచ్చి ఇంట్లో ఉన్న కిరణ్ రాయల్ ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని కిరణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిరణ్ రాయల్ అరెస్టుపై తిరుచానూరు పోలీసులను జనసేన నేతలు సంప్రదించారు. తాము తీసుకొని రాలేదంటూ తిరుచానూరు పోలీసులు స్పష్టం చేశారు. కిరణ్ కుటుంబ సభ్యులు, జనసేన నేతలు తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు. కిరణ్ రాయల్ ను వెంటనే విడుదల చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మోదీ- పవన్ భేటీ సమయంలో
ప్రధాని మోదీతో పవన్ భేటీ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని జనసేన నేతలు తప్పుబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కిరణ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేన పార్టీకి ముఖ్యనేతగా ఉన్నారనే ఆయనను టార్గెట్ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలే ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని అందుకు కిరణ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.