Chandragiri: చంద్రగిరి నియోగాకవర్గంలో పెండింగ్ పనులకు టీటీడీ నిధులు!
Chittoor: చంద్రగిరి నియోగాకవర్గంలో అభివృద్ధి పనులకు టీటీడీ నిధులు ఇవ్వాలని ఆదేశాలు వచ్చినట్టు టాక్ నడుస్తోంది. దీనిపై వైసీపీ విమర్సలు చేస్తోంది. గతంలో మంజూరైన వంద కోట్ల సంగతేంటని ప్రశ్నిస్తోంది.
Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఆసక్తిగా చూసేలా చేసింది ఈ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో రహదారులకు, వంతెనలకు మోక్షం కలిగింది.
3 ఏళ్లుగా ప్రజలకు కష్టాలు
2021లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చి పంటలు, ఇళ్లు, రోడ్లు, రహదారుల, వంతెనలు పూర్తిగా ధ్వంసం చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం వాటి నిర్మాణానికి తాత్కాలిక మరమ్మతులు చేసిందే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో గత మూడు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రహదారులు, వంతెనలపై ప్రజలు అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
చెవిరెడ్డి రూ.100 కోట్లు ఏమైంది..?
చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో 10 సంవత్సరాల కాలం మాజీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేగా పని చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎంపీపీ, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిపాలన సాగించారు. వారి పరిపాలన కాలంలోనే రహదారుల, వంతెనలు, చెరువులు దెబ్బతిన్నాయి. రాయల చెరువుకు గండి పడితే సుమారు 50 గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. గండి పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేవరకు అక్కడే బస చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ పనులు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి మరమ్మతులు చేయలేదు.
వైసీపీ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏబీపీ దేశంతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పాడైన రోడ్లు, వంతెనల కోసం రూ.100 కోట్లు మంజూరైందన్నారు. దానిని అమలు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. టెండర్ల స్థాయిలోనే ఆ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కొత్తగా ప్రభుత్వం రాకతో ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయో తెలియదంటున్నారు.
చొరవ తీసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని
నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి హాజరైన నాని ముఖ్యమంత్రికి నియోజకవర్గంలోని రహదారుల మరమ్మత్తులు, వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. దానిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.100 కోట్లు ఏమయ్యాయి అనేది మాత్రం చెప్పడం లేదు.
నిర్మాణాలకు టీటీడీ నిధులు
చంద్రగిరి నియోజకవర్గంలో వర్షాల కారణంగా చాలా వరకు వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా చిగురువాడ, తనపల్లి, తిరుచానూరు ఇలా స్వర్ణముఖి నది ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఇచ్చిన వినతి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీకి లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు, వంతెనలు నిర్మాణానికి టీటీడీ నిధులు విడుదల చేయాలనేది ఆ లేఖలోని సారాంశం.
నాడు వద్దన్నారు...
తిరుమలకు వచ్చే యాత్రికులు తిరిగే తిరుపతి లాంటి ప్రాంతాలో పారిశుధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ నుంచి కొంత నిధులు ఇవ్వాలని తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ వినతి మేరకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు, కొన్ని పార్టీలు మినహా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. అయితే అప్పుడు టీటీడీ నిధులు తిరుపతికి వద్దని పోరాటాలు చేసిన కూటమి నాయకులు నేడు చంద్రగిరిలో రహదారులు, వంతెనల నిర్మాణానికి టీటీడీ నిధులు ఎలా మంజూరు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. దానిని ఎలా సమర్థిస్తారాని నిలదీస్తున్నారు.